అందుబాటులోకి నాజల్ స్ప్రే

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: కరోనా పేషంట్లకు శుభవార్త చెప్పింది ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లెన్‌మార్క్‌. కరోనా రోగుల చికిత్సలో కీలకంగా పనిచేసే నాజల్‌ స్ప్రేను అందుబాటులోకి తెచ్చింది. మహమ్మారి చికిత్సలో భాగంగా దేశంలోనే తొలిసారిగా నాజల్‌ స్ప్రేను అందుబాటులోకి తెచ్చింది. ఫ్యాబిస్ప్రే పేరుతో దేశంలో విడుదల చేసింది. ముంబైకి చెందిన ఈ ఈ ఫార్మా కంపెనీకి ఇప్పటికే డీజీసీఐ అనుమతి ఇచ్చింది. కరోనాతో బాధపడుతున్న వయోజనులకు ఈ స్ప్రేను అందించవచ్చని తెలిపింది. కెనడాకు చెందిన సనోటైజ్‌ ఫార్మా సంస్థ భాగస్వామ్యంతో ఫ్యాబిస్ప్రేను అభివృద్ధి చేశారు. ఈ నైట్రిక్‌ ఆక్సైడ్‌ నాజల్‌ స్ప్రేను భారత్‌లో తయారీ, మార్కెట్‌కు గ్లెన్‌మార్క్‌ ఫార్మాకు డీజీసీఐ ఇప్పటికే అనుమతి ఇచ్చింది.మూడు దశల్లో జరిపిన ప్రయోగాల్లో ఈ స్ప్రే సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. స్ప్రే తీసుకున్న 24 గంటల్లో 94శాతం వైరల్‌ లోడ్‌ తగ్గినట్లు ప్రయోగాల్లో స్పష్టమైంది.

ఈ నాజల్‌ స్ప్రేతో కొవిడ్‌ బాధితులకు ఎలాంటి దుష్ప్రభావాలు లేవని చెబుతోంది గ్లెన్‌మార్క్‌. స్ప్రేను ముక్కుద్వారా తీసుకున్నప్పుడు వైరస్‌ను విజయవంతంగా అడ్డుకుంటున్నట్లు తెలిపింది ఫార్మా సంస్థ. వైరస్‌ ఊపిరితిత్తుల్లోకి చేరకముందే అడ్డుకునేలా ఫాబిస్ప్రేను అభివృద్ధి చేశామని చెప్పింది.పలు దశల్లో నిర్వహించిన ప్రయోగాలు సక్సెస్‌ అయినట్లు వెల్లడించింది. కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నాజల్‌ స్ప్రే సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలిన విషయాన్ని గుర్తు చేశారు గ్లెన్‌మార్క్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ మోనికా టాండన్‌. ఆల్ఫా, బీటా, గామా, డెల్టాతోపాటు ఎప్సిలాన్‌ వంటి వేరియంట్లను నాజల్‌ స్ప్రే నిమిషాల్లోనే నాశనం చేస్తున్నట్లు అమెరికా యూటా స్టేట్‌ యూనివర్సిటీలో జరిపిన ప్రయోగాల్లో తేలిందని గుర్తుచేశారు. డీజీసీఐ నిబంధనల ప్రకారం.. ఈ నాజల్‌ స్ప్రే తుది దశ ప్రయోగాలను భారత్‌లోనూ చేపట్టారు. దేశవ్యాప్తంగా 20చోట్ల 306 మంది కొవిడ్‌ బాధితులపై ప్రయోగం చేశారు. స్ప్రే సత్ఫలితాలివ్వడంతో డీసీజీఐ అనుమతులు మంజూరు చేసింది.
Tags: corona Nasal spray,Health Insights

Post bottom

Leave A Reply

Your email address will not be published.