ప్రజలకు ఉపాధి అవకాశాలను సృష్టించడంపై కాంగ్రెస్ దృష్టి
- కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ
- లక్నో ఫిబ్రవరి 5
వ్యక్తుల దురహంకారాన్ని నిర్మూలించడం గురించి కాంగ్రెస్ మాట్లాడబోదని, ప్రజలకు ఉపాధి అవకాశాలను సృష్టించడంపై దృష్టి పెడుతుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా చెప్పారు. ఇటీవల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలను ఆమె పరోక్షంగా తిప్పికొట్టారు. యోగి ఆదిత్యనాథ్ ఇటీవల పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ నేతల దురహంకారం ఎన్నికల ఫలితాల తర్వాత అంతమవుతుందని చెప్పారు.
ప్రియాంక గాంధీ అలీగఢ్‌లో ఓ వ్యక్తితో మాట్లాడుతూ, దురహంకారం అంతమవడం గురించి ఎవరో మాట్లాడుతున్నారని కొందరు చెప్తున్నారన్నారు. తాము (కాంగ్రెస్) మాత్రం ఉద్యోగాల సృష్టి గురించి మాత్రమే మాట్లాడతామన్నారు. ఇక్కడ నిల్చున్నవారిలో అనేక మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 12 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రియాంక గాంధీ వాద్రా అలీగఢ్‌లో ఇంటింటికీ వెళ్ళి కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారు.