ఇక్రిశాట్‌ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపాలి

హైదరాబాద్‌ ఫిబ్రవరి 5
50 ఏళ్లుగా ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. వచ్చే 50 ఏళ్లలో మరిన్ని పరిశోధనలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌లో ప్రధాని మోదీ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ లోగోను ప్రధాని  ఆవిష్కరించారు. ఇక్రిశాట్‌లో పర్యావరణ మార్పుల పరిశోధన కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. అందరికీ ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇక్రిశాట్‌ 50 ఏళ్ల ప్రయాణంలో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపారు. వసంత పంచమీ రోజున ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక్రిశాట్‌ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపాలని ఆకాంక్షించారు.‘ఇక్రిశాట్‌ సేవలను ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను. టెక్నాలజీని మార్కెట్‌తో జోడించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ఇక్రిశాట్‌ కృషి చేస్తోంది. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ ఉత్పాదకత సాధించాలి. ఏపీ, తెలంగాణ పంటల దిగుబడి గణనీయంగా ఉంది. పంటకాలం తక్కువ ఉండే మరిన్ని వంగడాలు సృష్టించాలి.

వాతావరణ మార్పులకు తట్టుకునే వంగడాలు సృష్టించాలి. దేశంలో 80శాతం చిన్న రైతులు ఉన్నారు. వారు సంక్షోభం ఎదుర్కొంటున్నారు. చిన్న రైతులు సాగు వ్యయం తగ్గించాల్సిన అవసరం ఉంది. పరిశోధన, ఆవిష్కరణల్లో ఇక్రిశాట్‌ ఎంతో కృషిచేస్తోంది. వాతావరణ పరిశోధన కేంద్ర రైతులకు ఎంతో ఉపయోగకరం. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు మానవ నష్టం గురించి చర్చిస్తాం. కానీ మౌలిక సదుపాయలకు జరిగిన నష్టం గురించి మాట్లాడం.వాతావరణ మార్పులను తట్టుకునేలా ప్రపంచస్థాయి పరిశోధలనకు భారత్‌ వేదికగా మారింది. ఇందుకోసం భారత్‌ ఎన్నో చర్యలు తీసుకుంది.ఈ పరిశోధనలు చిన్న, మధ్య తరగతి రైతులకు ఎంతో ఉపయోగకరం. ఈసారి బడ్జెట్‌లో కూడా వాతావరణ మార్పుల అంశానికి ప్రాధాన్య ఇచ్చాం. దేశంలో వ్యవసాయానికి సంబంధించి విభిన్నమైన సంప్రదాయాలు ఉన్నాయి. సహజ సేద్యం, డిజిటల్‌ వ్యవసాయానికి ఈ బట్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చాం. వచ్చే 25 ఏళ్లలో వ్యవసాయం మార్పులపై దృష్టి సారించాం. డిజిటల్‌ వ్యవసాయం దేశ ముఖ చిత్రాన్ని మార్చుతోంది. యువకులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి’ అని పేర్కొన్నారు..

Post bottom

Leave A Reply

Your email address will not be published.