అనంతలో నాలుగు జిల్లాల డిమాండ్లు
అనంతపురం, ఫిబ్రవరి11: హిందూపురం నిరసనలతో హోరెత్తతుతోంది.. ధర్మవరం.. నిరాహారదీక్షలతో దద్దరిల్లుతోంది.. పెనుకొండ మౌన దీక్షలతో మరో ఉద్యమం రాజేస్తోంది.. గుంతకల్లు ఆందోళనలతో గర్జిస్తోంది. వీటిన్నంటికీ కారణం ఒక్కటే.. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న జిల్లాల విభజన నిర్ణయం. మొదట్లో ఆల్ హ్యాపీస్ అన్నట్టుగానే కనిపించినా.. తాజాగా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో దీనిపై ఉద్యమాలు మొదలవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు అధికారపార్టీ నేతలను కౌంటర్ చేస్తూ ఉద్యమంలోకి దిగడంతో మంత్రి, ఎమ్మెల్యేలు డిఫెన్స్ లో పడిపోతున్నారు..హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ గర్జిస్తున్నారు.. ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ తగ్గేదే లేదంటున్నారు.. గుంతకల్లులో రాజకీయ పార్టీలు కదం తొక్కుతున్నాయి.. పెనుకొండలో ప్రజా సంఘాలు దీక్షలతో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పరిస్థితి గురించి నాలుగు ముక్కల్లో చెప్పాలంటే ఇదీ పరిస్థితి. ప్రభుత్వం ఇటీవల జిల్లాల విభజన నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాల్లో అతి పెద్ద జిల్లాగా ఉన్న అనంతను విభజించడంపై అంతా సంతోషం వ్యక్తం చేశారు. అందునా ఎన్నో సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసిన సత్యసాయి పేరుతో పుట్టపర్తి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.
కానీ రెండు రోజులు అయ్యాక హిందూపురం కేంద్రంగా ఉద్యమం మొదలైంది. పార్లమెంట్ కేంద్రమైన హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయకపోవడం ఏంటన్న ప్రశ్న వినిపించింది. అంతే కాదు జిల్లాలో పెద్ద పట్టణం, పారిశ్రామీకరణ పరంగా చాలా డెవలప్‌మెంట్ ఉన్న ప్రాంతమని అక్కడి ప్రజల వాదన. ఈ ఉద్యమం మెల్లాగనే కనిపించినా.. ఇందులో ఎమ్మెల్యే బాలకృష్ణ ఎంటర్ కావడంతో ఇది రాష్ట్రంలో పెద్ద సమస్యగా మారింది.హిందూపురంలో దీక్ష చేపట్టిన బాలకృష్ణ భారీ ర్యాలీతో కదం తొక్కారు. అనంతరం జిల్లా కలెక్టర్ ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని, అవసరమైతే సీఎం ని కూడా కలుస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు ఇంకా అవసరమైతే రాజీనామా కూడా చేస్తామని హెచ్చరించారు. ఇదే పెద్ద సమస్యగా మారితే.. ధర్మవరం కేంద్రంగా మరో ఉద్యమం మొదలైంది. తెలుగు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రెవెన్యూ డివిజన్ గా ధర్మవరం ఉంది. అయితే కాలక్రమేణా ఇందులో మండలాలు వేరే కొత్త రెవెన్యూ డివిజన్లలోకి మారిపోయాయి. ఇప్పుడు జిల్లాల విభజనతో కేవలం నాలుగు మండలాలు మాత్రమే మిగిలాయి. అందుకే ప్రభుత్వం వాటిని పుట్టపర్తి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి అందులో కలిపేశాయి. అంటే ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దైనట్టు అన్నమాట. దీంతో పరిటాల శ్రీరామ్ రంగంలోకి దిగారు.
ధర్మవరం డివిజన్ కోసం భారీ ర్యాలీ నిర్వహించి.. నిరాహార దీక్ష చేప్టటారు. అలాగే జిల్లా కలెక్టర్ ని కలసి వినతి పత్రం కూడా అందజేశారు. అక్కడితో ఆగలేదు. సీఎం జగన్ కు లేఖ రాశారు. లేఖలో సున్నితమైన పదజాలంతో ఘాటుగానే సీఎంకి ప్రశ్నలు సంధించారు శ్రీరామ్.ఒకచోట ఏమో జిల్లా కేంద్రం కోసం.. మరోచోట ఏమో రెవెన్యూ డివిజన్ కోసం.. పోరాటాలు జరుగుతుంటే.. మరో రెండు ప్రాంతాల్లో కూడా జిల్లా కేంద్రం కోసం ఉద్యమం మొదలైంది. విజయనగర రాజుల రెండో రాజధానిగా పేరుగాంచిన పెనుకొండను శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా ప్రభుత్వం ప్రకటించాలని చాలా రోజున నుంచి ప్రతిపాదన ఉంది. ఇందుకోసం పెనుకొండ జిల్లా సాధన సమితి కూడా ఏర్పడింది. అయితే హిందూపురం ప్రాంతంలో ఉద్యమం మొదలు కావడంతో కాస్త గ్యాప్ తో పెనుకొండ కూడా ఇప్పుడు జిల్లా సాధన ఉద్యమం మొదలైంది. పెనుకొండ సమీపంలోని వైజంక్షన్ వద్ద శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహం ఎదుట పర్యాటక పోరాట కమిటీ ఆధ్వర్యంలో పెనుకొండను శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా ప్రకటించాలని 100 గంటల మౌనదీక్షను చేపట్టారు.
దీనికి పెద్ద ఎత్తున రాజకీయ, ప్రజా సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. పెనుకొండతో పాటు గుంతకల్లును కూడా జిల్లాను చేయాలని పలువురు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన బాట పట్టారు. ప్రతి పట్టణంలో ఎక్కడో ఒక చోట నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఇలా మొత్తం నాలుగు ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమాలకు టీడీపీ నేతలు మద్దతు ఇస్తున్నారు. అంతే కాదు ఒక్క పెనుకొండ మినహా మిగిలిన అన్ని చోట్ల టీడీపీ నేతలే లీడ్ చేస్తున్నారు. దీంతో హిందూపురంలో వైసీపీ నేత ఇక్బాల్, పెనుకొండలో మంత్రి శంకర్ నారాయణ, ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, గుంతకల్లులో వై.వెంకట్రామిరెడ్డి డిఫెన్స్ లో పడిపోయారు. ఇటు ఆ ఉద్యమాలు మద్దతు పలకలేదు. అలా అని వారి డిమాండ్ తప్పు అని కూడా అనలేరు. మొత్తం మీద జిల్లా రగడ, రెవెన్యూ డివిజన్ రద్దు అంశాలు అధికార పార్టీ పార్టీ నాయకులతో పెద్ద తలనొప్పిగా మారాయి.