యాక్టివ్ పాలిటిక్స్ కు గంటా దూరం…

విశాఖపట్టణం, ఫిబ్రవరి 22: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. టీడీపీ ఎమ్మెల్యే. సైకిల్ పార్టీతో సుదీర్ఘ అనుభవం ఉన్న కాపు నేత. అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ వార్తల్లో నిలిచేందుకు తాపత్రయపడతారు. ఈక్వేషన్లు, కేలిక్యూలేషన్లతో రాజకీయాలను తన చుట్టూ తిప్పుకోవాలనే ఆత్రం ఆయనలో కనిపిస్తుంది. ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి MLAగా ఉన్న ఆయన రాజకీయ స్తబ్ధత పాటిస్తున్నారు. పార్టీకి, ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండటం లేదు. నార్త్ బాధ్యతలను ఇంఛార్జ్‌ చేతుల్లో పెట్టి యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరం జరిగినట్టు కనిపించారు. కానీ.. GVMC ఎన్నికల్లో అధినాయకుడితో కలిసి ప్రచారం చేసిన తర్వాత.. పార్టీకోసం బహిరంగ వేదికలపైకి వచ్చిన సందర్భం లేదు.గంటాకు టీడీపీ హైకమాండ్‌కు మధ్య దూరం పెరిగిందనే భావన ఉంది. అది నిజమే అన్నట్టు ఆయన వైఖరి ఉంటోంది. ఉత్తరాంధ్రలో పార్టీ పటిష్టత, భవిష్యత్ ప్రణాళికల కోసం చంద్రబాబు ఎమ్మెల్యేలతో ముఖాముఖీ సమావేశం అవుతున్నారు.

ఆ భేటీ కోసం ఎన్టీఆర్ భవన్ నుంచి గంటాకు పిలుపు వచ్చింది. డేట్.. టైమ్ ఫిక్స్ అయ్యాక ఆఖరి నిముషంలో అధినేతతో భేటీ వాయిదా వేసుకున్నారు గంటా. దీనికి ఆయన దగ్గర బలమైన కారణాలు ఏవీ కనిపించలేదు. దీంతో అసలు ఏం జరుగుతుందనే ఉత్సుకత రాజకీయ వర్గాల్లో రేకెత్తింది.చాలా కాలంగా గంటా శ్రీనివాస్ పక్కపార్టీలవైపు చూస్తున్నారనే ప్రచారం నలుగుతోంది. మొదట్లో వైసీపీలో చేరేందుకు గట్టి ప్రయత్నాలు చేసినా వర్కవుట్ కాలేదు. మంత్రి అవంతి, ఎంపీ విజయసాయిరెడ్డి వంటి వారు బహిరంగ వేదికలపైనే వ్యతిరేకించారు. ఆ తర్వాత టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్న గంటా.. మధ్యలో కాస్త యాక్టివ్ రోల్ తీసుకునేందుకు ప్రయత్నించారు. తాజాగా అధినేతతో సమావేశానికి గంటా డుమ్మాకొట్టడం వెనక అసలు కారణాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. త్వరలో చంద్రబాబును వ్యక్తిగతంగా వెళ్లి కలవాలనే ఆలోచనలో భాగంగానే మీటింగ్‌కు హాజరు కాలేదని గంటా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే.. అసలు సంగతి ఖచ్చితంగా వేరే ఉందనేది వినికిడివచ్చేవారం మెగాస్టార్ చిరంజీవితో గంటా భేటీ కానున్నారు.

వీరిద్దరి మధ్య చాన్నాళ్లుగా అనుబంధం ఉంది. ఈసారి భేటీ పూర్తిగా రాజకీయ చర్చలకు సంబంధించిందేనని భోగట్టా. వచ్చే ఎన్నికల నాటికి జనసేన, తెలుగుదేశం జట్టుకట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి.క్షేత్రస్ధాయిలో ఇప్పటికే రెండుపార్టీలు ఒక అవగాహనకు వచ్చేసినట్టే చెబుతున్నారు. ఈ తరుణంలో రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించాలనేది గంటా ఆలోచనట. కాపు సామాజికవర్గం నాలుగురోడ్ల కూడలిలో రాజకీయ అవకాశం కోసం ఎదురు చూస్తోంది. అలాగని కొత్త పార్టీల వంటి ప్రయోగాలు చేసే అవకాశం, ఆస్కారం కనిపించడం లేదు. దీంతో సామాజికవర్గాన్ని జనసేనవైపు డ్రైవ్ చేయడం ద్వారా ఓటింగ్ శాతం పెంచుకోవడం కీలకమనే చర్చకు దారితీసింది. టీడీపీ, జనసేనల మధ్య సర్దుబాట్లు, ఓటింగ్ శాతం ఆధారంగా తన రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించుకోవాలనే ఆలోచనలో గంటా ఉన్నారట. అప్పటి వరకు ఆయన వెయింట్‌ అండ్‌ వాచ్‌ విధానంలో ఉంటారట.

Post bottom

Leave A Reply

Your email address will not be published.