ఆశల పల్లకీలో ఆలీ
విజయవాడ, ఫిబ్రవరి 22: ఆ మధ్య సినీరంగ సమస్యలపై చిరంజీవి బృందంతో చర్చలు జరిగిన సమయంలో తళుక్కుమన్నారు నటుడు అలీ. అప్పుడే అలీ భుజంతట్టిన సీఎం జగన్ వచ్చేవారం కలుద్దాం అన్నారు. ముఖ్యమంత్రి అలా అన్నారో లేదో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ప్రచారం ఊపందుకుంది. అలీకి రాజ్యసభ ఖాయం అని అంతా అనేసుకున్నారు కూడా. వైసీపీకి ముందు నుంచి అలీ మద్దతుదారుగా ఉన్నారు. గతఎన్నికల్లో పార్టీకోసం ప్రచారం కూడా చేశారు. అంతకుమించి సామాజికవర్గాల సమీకరణాలో ఫిట్ అయ్యారు అలీ. రాజ్యసభకు వైసీపీలో ముస్లింల నుంచి ఎవరూ లేరు. పైగా పదవుల పంపకాల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ ఈక్వేషన్లకు అనుగుణంగానే ఇప్పటి వరకు పదవుల పంపకం జరిగింది. అందుకే అలీ పేరు విస్తృత చర్చకు కారణమైంది.సినీగ్లామర్ కూడా అలీకి ఉన్న అదనపు అర్హత. వీటన్నింటిని బేరీజు వేసుకుని అలీకి రాజ్యసభ సీటు రిజర్వ్ అయ్యిందనే చర్చ సాగింది. వాస్తవంగా కూడా రాజ్యసభకు అవకాశం ఎవరికి ఇవ్వాలన్న చర్చ వచ్చినప్పుడు అలీ పేరు పార్టీ పరిశీలనలోకి వెళ్లిందట. అనేక కూడికలు, తీసివేతల తర్వాత పెద్దలసభ ప్రతిపాదన నుంచి అలీ పేరు పక్కకు జరిగిందని సమాచారం.
రాజ్యసభ సభ్యత్వం బదులు వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ పదవిని సినీ నటుడు అలీకి ఇవ్వాలనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు సమాచారం. వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ గిరి కూడా రాష్ట్రస్థాయి పోస్ట్ అని.. ముస్లింలకు సంబంధించి కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వక్ఫ్ బోర్డు ఆస్తుల సంరక్షణతోపాటు వివాదాలకు అవకాశం లేకుండా బాధ్యతలు నిర్వర్తించే వారు అవసరమనే ఆలోచనలో వైసీపీ ఉందట. ఆ కోవలో నాన్ కాంట్రవర్సీ ఇమేజ్ ఉన్న అలీ సరైన ఛాయిస్ అవుతారని అభిప్రాయపడుతున్నట్టు సమాచారం.త్వరలోనే అలీకి కీలక బాధ్యతలు కట్టబెడతారని వైసీపీ వర్గాలు కూడా గట్టిగానే చెబుతున్నాయి. గత ఎన్నికల్లోనే ఆయన పోటీ చేయాలని చూశారు. ఆ అవకాశం దక్కలేదు. వచ్చే ఎన్నికల్లోనైనా బ్యాలెట్ వార్‌లోకి దిగాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే ప్రస్తుతం ఏ పదవి ఇచ్చినా.. లక్ష్యం దిశగా అలీ అడుగులు వేయడానికి అది ఉపయోగపడుతుందని అనుకుంటున్నారట. మరి.. అధికారపార్టీలో అలీ లక్ ఎలా ఉందో చూడాలి.