చైనా కఠిన ఆంక్షలు… జీరో కేసులు
బీజింగ్: చైనా దేశం డెల్టా వేరియంట్ కరోనా వైరస్ ను నిరోధించింది. ఆ వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకున్నది. సోమవారం నాడు చైనా దేశంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కఠిన ఆంక్షల మూలంగానే ఇది సాధ్యమైంది.
ఈ ఏడాది జూలై నెల తరువాత ఒక్క కేసు కూడా నమోదు కాని రోజు సోమవారం నిలిచింది. నాన్ జింగ్ నగరంలోని ఏయిర్ పోర్టులో తొలిసారి జూలై నెలలో డెల్టా వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. స్వల్ప సమయంలోనే 31 ప్రావీన్సుల్లో 1200 కేసులు రిపోర్టు అయ్యాయి. కేసుల పెరుగుదలను గమనించిన ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేసి ఛాలెంజింగ్ గా తీసుకున్నది. స్థానిక ప్రభుత్వాలు ఎక్కడికక్కడ కఠిన ఆంక్షలు అమలు చేసి లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలు చేశారు. కోట్లాది మందిని ఇళ్లకే పరిమితం చేసి టెస్టులు భారీ ఎత్తున చేపట్టారు. ప్రజలు సంచరించకుండా నిరోధించడంతో డెల్టా వేరియంట్ కేసులు తగ్గుముఖం పట్టాయి. సోమవారం నాడు ఒక్క కేసు నమోదు కాలేదు. విదేశాల నుంచి వచ్చిన వారిలో 21 మందికి వైరస్ లక్షణాలు కన్పించాయి.