జగన్ బెయిల్… మరో 20 రోజులు టెన్షన్
హైదరాబాద్: ఏపి సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ వాదనలు విన్న సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పును వచ్చేనెల 15కు వాయిదా వేసింది.
జగన్ ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, బెయిల్ షరతులను ఉల్లంఘించారంటూ ఈ ఏడాది జూన్ 4న సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలైంది. వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. వైసిపి ఎంపి వి.విజయసాయి రెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలంటూ రఘురామ మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు న్యాయమూర్తి వాదనలు విన్నారు. తీర్పును వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పుపై రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు, వైసిపి కార్యకర్తలు ఆతృతగా ఎదురు చూశారు.