సిసిఎస్ కస్టడీ కు కార్వి చైర్మన్ పార్థసారథి
హైదరాబాద్: కార్వి స్టాక్ బ్రోకింగ్ ప్రైవేటు లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సి. పార్థసారధి (67) ను సిసిఎస్ పోలీసులు ఇవాళ ఉదయం కస్టడీకి తీసుకున్నారు.
చంచల్ గూడ జైలు నుండి రెండు రోజుల కస్టడీ కోసం పోలీసులు ప్రత్యేక వాహనంలో ఆయనను సిసిఎస్ కు తీసుకువచ్చారు. ఇండస్ ఇండ్ బ్యాంకును మోసగించిన కేసులో అరెస్టు అయి చంచల్ గూడ జైలులో ఉన్నారు. ప్రజలకు చెందిన షేర్లను తన కంపెనీ షేర్లుగా తనఖా పెట్టి ఇండస్ ఇండ్ బ్యాంకు నుంచి రూ.137 కోట్ల రుణం సేకరించారు. దీనిపై ఇండస్ ఇండ్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే కాకుండా పలు షేర్లు, సెక్యురిటీలను తనఖా పెట్టి రూ.720 కోట్లు సేకరించినట్లు విచారణలో వెల్లడైంది. షేర్లు కొనుగోలు చేసిన వ్యక్తులతో సంబంధం లేకుండా అప్పులు తీసుకున్నారు. ఇలా తీసుకున్న రుణాలను రియల్టీ, ఇన్ఫోటెక్ కంపెనీలకు మళ్లించినట్లు చెప్పినప్పటికీ ఆ కంపెనీల్లో నిధులే లేవని తేలింది. రెండు రోజులు విచారణలో పార్థసారథి నుంచి పోలీసులు కీలకమైన సమాచారం, ఆధారాలు సేకరించనున్నారు.