ఆహ్లాదకర వాతావరణంలో విద్యా బోధన: తలసాని

రథ సారథి ,హైదరాబాద్:

 

ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన జరిగే విధంగా ప్రభుత్వ పాఠశాలలను అన్ని రకాల సౌకర్యాలు, వసతులతో అభివృద్ధి చేయడమే మన బస్తి మన బడి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. బుధవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మారావు నగర్ లో గల మైలార్ గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 18.92 లక్షల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని పికెట్ లో గల లక్ష్మి నగర్ లోని ప్రాథమిక పాఠశాలలో 36.28 లక్షల వ్యయంతో, ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని రాజ్ భవన్ ప్రాథమిక పాఠశాల లో 17.38 లక్షల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేయగా, నేడు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆయా నియోజకవర్గ ఎమ్మేల్యేలు లు సాయన్న, దానం నాగేందర్, బెవరేజేస్ కార్పోరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, టిఎస్ఎంఐడిసి చైర్మన్ ఏర్రోళ్ళ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, డీఈవో రోహిణి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పాఠశాలలోని అన్ని తరగతి గదులు, టాయిలెట్స్ ను తిరిగి పరిశీలించారు. నూతన ఫర్నిచర్, పాఠశాల భవనానికి కలర్స్ వేసిన తర్వాత ఎలా ఉంది అని విద్యార్ధులను అడగగా, చాలా బాగుంది అని విద్యార్ధులు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సౌకర్యాలు, వసతులు లేని కారణంగానే అనేకమంది విద్యార్ధులను తమ తల్లిదండ్రులు వేలాది రూపాయల ఫీజులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చాలి…విద్యార్ధులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనే ముఖ్యమంత్రి ఆలోచన మేరకు మన బస్తీ మన బడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమం క్రింద రాష్ట్రంలో 26,065 పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 9,123 పాఠశాలలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇందుకు గాను 7,289 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. హైదరాబాద్ జిల్లాలో 239 పాఠశాలలను ఎంపిక చేసి 44 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో ప్రహారీగోడ నిర్మాణం, టాయిలెట్స్ నిర్మాణం, అభివృద్ధి పనులు, విద్యుత్, త్రాగునీటి సౌకర్యం, ఫర్నిచర్ కొనుగోలు తదితర 12 రకాల అభివృద్ధి పనులను చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించలేదని అన్నారు. మన బస్తి మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని తెలిపారు. కార్పోరేట్ పాఠశాలను తలపించే విధంగా విద్యార్ధులకు ఎంతో నాణ్యమైన టేబుల్స్, బెంచీలు, ఇతర ఫర్నిచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. భవనాలకు కలర్స్ వేయడం వలన ఎంతో ఆకర్షణీయంగా మారాయని చెప్పారు. అన్ని వసతులు, సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్ధులను చేర్పించాలని పిలుపునిచ్చారు. ఉచితంగా విద్యాబోధన తో పాటు నాణ్యమైన బోజనాన్ని కూడా అందిస్తున్నట్లు వివరించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాలను ఎంతో సక్రమంగా నిర్వహించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు హేమలత, విజయారెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ప్రదానోపాద్యాయులు ఉమాదేవి, రత్నమాల, మంజులత, డిప్యూటీ డి ఈ వో లు చిరంజీవి, సామేల్ తదితరులు పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.