వాగ్గేయకారోత్సవాల్లో నవకీర్తన గోష్టితో పులకించిన భద్రగిరులు…ఘనంగా నగర సంకీర్తన
భద్రాచలం, ఫిబ్రవరి 04 : శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ప్రముఖ వాగ్గేయకారుడు భక్తరామదాసు 389వ జయంతి వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. దేవస్థానం, అలివేలు మంగ సర్వయ్య ఛారిటబుల్ ట్రస్టులు సంయుక్తంగా ఒక్క రోజు వాగ్గేయకారోత్సవాన్ని నిర్వహించగా అందులో నవకీర్తన గోష్టిలో పాల్గొన్ని సంగీతకళాకారులు ఆలపించిన భక్తరామదాసు ఆణిముత్యాల్లాంటి తొమ్మిది కీర్తనలను ఆలపించారు. ఈ నవకీర్తనగోష్టితో భద్రగిరులు పులకించాయి. అంతకు ముందు ఉదయం భక్తరామదాసు చిత్రపటంతో గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామదాసు గోత్రనామాలతో రామయ్యకు కేశవనామార్చన జరిగింది.
స్వర్ణకవచధారియైన రామయ్య చెంత పూజలు అనంతరం ధ్వజస్తంభం ఎదురుగా ఉన్న భక్తరామదాసు విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం జరిగింది. దేవస్థానం ఈవో శివాజీ దంపతులు నగరసంకీర్తనగా భక్తరామదాసు కీర్తనల ఆలాపనల మధ్య గోదావరికి చేరుకుని నదీ తల్లికి పట్టువస్త్రాలు, శేషమాలికలు, పసుపు, కుంకుమ సమర్పించారు. తర్వాత శోభాయాత్ర నిర్వహించి ఉత్తర ద్వారం వైపు ఉన్న భక్తరామదాసు విగ్రహానికి అభిషేకం చేసి పూలమాలలు అలంకరించి భద్రగిరి ప్రదక్షిణగా ఆలయానికి చేరుకున్నారు.
చిత్రకూట మండపంలో వాగ్గేయకారోత్సవాలను ఈవో శివాజీ వేదమంత్రోచ్ఛరణల మధ్య జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. మల్లాది సూరిబాబు, మల్లాది సోదరులు రాంప్రసాద్, రవికుమార్,డా.కె.శేషులత, నేండ్రగంటి కృష్ణమోహన్లు, భక్తరామదాసు కీర్తనలను ఆలపించారు. వేదోక్తంగా జరిగిన ఈ ఉత్సవం ఆద్యంతం సంగీత ప్రియులను అలరించింది.