రాజ్యాంగం కాదు… టీఆర్‌ఎస్ సర్కార్‌ను మార్చాలి
- ప్రజాస్వామిక తెలంగాణ కోసం బిజేపితో కలిసి పోరాడండి: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
- కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా దిల్లీలో ‘బిజేపి భీమ్ పాదయాత్ర’
ఫిబ్రవరి 4 : సీఎం కేసీఆర్ చెబుతున్నట్లు మార్చాల్సింది రాజ్యాంగం కాదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అని బిజేపి తెలంగాణ అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ అన్నారు. టీఆర్‌ఎస్ ముక్త్ తెలంగాణ కోసం బిజేపి ప్రయత్నం చేస్తుందన్నారు. కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీని బంగాళాఖాతంలో పడేసి, తెలంగాణ చరిత్రను తిరిగి రాయాలన్నారు. ‘ప్రజాస్వామిక తెలంగాణ కోసం ప్రజాస్వామ్య పద్దతిలో బిజేపి పోరాటం చేస్తుంది. ఈ పోరాటానికి తెలంగాణ ప్రజలు మాతో కలిసి రండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆత్మగౌరవం ముఖ్యం. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలన్న సమస్యకన్నా మరేది పెద్దది కాదు. సమస్యను సృష్టించి అందులో ఎంజాయ్ చేసే వ్యక్తి కేసీఆర్’ అని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ కామెంట్‌ను నిరసిస్తూ బండి సంజయ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీ తెలంగాణ భవన్‌లోని అంబేడ్కర్ విగ్రహం నుంచి పార్లమెంట్ వరకు ‘బిజేపి భీమ్ పాదయాత్ర’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిలు అర్వింద్, సోయంబాపు రావు, బిజేపి నేతలు నూనె బాల్ రాజు, బంగారు శృతి, వెదిరె శ్రీరాం, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమర వీరుల కనుమరుగు చేసేందుకు సెప్టెంబర్ 17 ను జరపడం లేదని ఆరోపించారు. తన చరిత్రనే తెలంగాణకు అందించాలన్నదే కేసీఆర్ పన్నాగం అని మండిపడ్డారు. కేసీఆర్ ఇంకా తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటున్నారంటే, ఇంతకన్న బరితెగింపు మరోటి లేదన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు మద్దతుగా టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల వ్యాఖ్యాలపై తెలంగాణ సమాజం థూ అని ఉమ్ముతుందన్నారు. మంత్రి పదవులు, ఎమ్మెల్యేల టికెట్ల కోసం కేసీఆర్ కాళ్లకు మోకరిల్లితే బిజేపి నష్టంలేదని, కానీ, అంబేడ్కర్‌ను విమర్శించేలా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించలేని స్థితిలో ఉన్నారంటే ఇంతకన్న సిగ్గుచేటు మరోటిలేదన్నారు.
గతంలో మాట తప్పితే తల నరుక్కుంటా అన్న కేసీఆర్‌కు…అసలు మెడపై తలకాయ లేదా? అందుకే నరుక్కోవడం లేదా? అనేది ప్రజలకు చెప్పాలన్నారు. ‘ఓడిపోయిన బిడ్డకు ఎమ్మెల్సీ పదవి, రాత్రి పూట మందుకలిపే నేతలకు రాజ్య సభ, జీ హుజూరు అని సలాం కొట్టెటోళ్లకు మంత్రి పదవి ఇవ్వాలని, సచివాలయం కూల్చి ప్రజాధనం వఈధా చేయాలని, ఫాంహౌజ్ నుంచి పాలన చేయాలని రాజ్యాంగంలో రాసుందా?’ అని ప్రశ్నించారు. నోటిపికేషన్ వేయకుండా నిరుద్యోగులు, 317 జీవోతో ఉద్యోగుల ఉసూరు పోసుకోవాలని రాసుందా అనేది ప్రజలకు చెప్పాలన్నారు.