- సిఎం తక్షణమే రాజీనామా చేయాలి
- కాంగ్రెస్ దీక్షలో ఎంఎల్‌సి జీవన్ రెడ్డి డిమాండ్
ఫిబ్రవరి 4 : రాజ్యాంగాన్ని కేసీఆర్ కించపరిచారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగబద్దంగా ఎన్నికైన సీఎం అలా మాట్లాడొచ్చా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎంగా కొనసాగే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. దళితుల మనోభావాలను కేసీఆర్ గాయపరిచారన్నారు. దళితుల పథకాలను అమలు చేయడానికి కేసీఆర్‌కు ఏ రాజ్యాంగం అడ్డుపడిందని ప్రశ్నించారు. కేసీఆర్ ఆలోచనలన్నీ వక్రబుద్దితోనే ఉన్నాయన్నారు. సచివాలయానికి వెళ్లకుండా ఏ రాజ్యాంగం అడ్డుకుందని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. రెండోరోజు కాంగ్రెస్ దీక్షలు కొనసాగాయి. భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశ రాజ్యాంగాన్ని కాదు, రాష్ట్రంలో అహంకార కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చాలని జీవన్ రెడ్డి అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలనడం కేసీఆర్ అంహకారానికి నిదర్శనమన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోహదం చేసిందని, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిన విషయం కేసీఆర్ మరిచి పోవద్దన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానపరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి హుందాగా, గౌరవంగా ఉండాలి కానీ, కంచే చేను మేసినట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ అధికారంలోకి వొచ్చిన తర్వాత రాష్ట్రంలో స్వేచ్ఛగా వోటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వంపై మాట్లాడిన వ్యక్తులపై అక్రమ కేసులు పెట్టి ఉక్కుపాదం మోపుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ వేల కోట్ల సంపాదించు కోవడానికి ఇప్పుడున్న రాజ్యాంగం అడ్డు వొస్తుంది కాబట్టి, కేసీఆర్ ఆయన రాజ్యాంగాన్ని కావాలని కోరుకుంటున్నారన్నారు.