ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి : ఎమ్మెల్యే
రథసారథి,మిర్యాలగూడ:
కృత్యాధార బోధనకు బోధనోపకరణాలను విరివిగా వినియోగించాలని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు పేర్కొన్నారు. స్థానిక రైతు వేదిక లో ఏర్పాటుచేసిన మండల స్థాయి టీ ఎల్ ఎమ్ (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) మేళాను ప్రారంభించి ఉపాధ్యాయులచే తయారు చేయబడిన స్టాల్స్ లను తిలకించి వాటిని వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతమునకు మన ఊరు మన బడి పథకం కింద రూ.7300 కోట్లతో మౌలిక వసతులు కల్పించడమే కాకుండా కార్పొరేట్ స్థాయి పాఠశాలలకు దీటుగా ఆంగ్లమాధ్యంలోనే విద్యను బోధించే విధంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి వృత్తి నైపుణ్యాలు పెంపొందే విధంగా ఎఫ్ ఎల్ ఎన్ తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలుపరుస్తుందని తెలిపారు. ప్రతి ఉపాధ్యాయుడు పాఠ్యప్రణాళిక ఆధారంగా పాఠ్యాంశాలను బోధనోపకరణాల ఆధారంగా బోధించాలని బోధనోపకరణాలు, బోధన అభ్యసన సామాగ్రి వినియోగంలో అందరికీ సామూహిక అవగాహన కలుగుటకు ఈ మేళా దోహదపడుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల ద్వారా ప్రదర్శించబడిన ఉపకరణాలను చూసి అందరికీ జ్ఞాపికలు అందించుటకు 50 వేల రూపాయలు బహుమానంగా ప్రకటించారు. గ్రామీణ ప్రాంతంలో నిరుపేద విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపుటకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, మండల పరిషత్ అధ్యక్షురాలు నూకల సరళ హనుమంత రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో జ్యోతిలక్ష్మి, జిల్లా సెక్టోరియల్ అధికారి వంగూరి వీరయ్య, మండల విద్యాధికారి ఎం బాలాజీ నాయక్, ఎఫ్ ఎల్ ఎన్ నోడల్ అధికారి సాంబశివరావు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కోలా శ్రీనివాస్, కొత్త రాఘవేంద్ర ప్రసాద్, మూడు తిరుపతి, నర్సిరెడ్డి, వెంకట్ రెడ్డి, రిసోర్స్ పర్సన్ లు బాలు, వెంకట్ రెడ్డి, నాయిని వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.