తెలంగాణాకు రూ.21 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు: కేటీఆర్
రథ సారథి,హైదరాబాద్:
దావోస్ పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి రూ.21వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
మంత్రి చేపట్టిన దావోస్ పర్యటన ముగిసిన సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు.
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు కోసం నాలుగు రోజుల పర్యటన విజయవంతంగా సాగిందన్న ఆయన 52 వాణిజ్య సమావేశాలు, 6 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 ప్యానల్ డిస్కషన్లలో పాల్గొన్నట్టు పేర్కొన్నారు. పలు దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని మంత్రి తెలిపారు.
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రూ.16వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో మరో 3 డేటా కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని, భారతీ ఎయిర్‌టెల్ గ్రూప్ రూ.2వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో భారీ హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ను నిర్మించనుందని కేటీఆర్ తెలిపారు. ఫార్మా రంగానికి చెందిన యూరోఫిన్స్ సంస్థ జీనోమ్ వ్యాలీలో రూ.వెయ్యికోట్లతో అత్యాధునిక లేబొరేటరీ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తోందని,కొత్త పెట్టుబడులకు సంబంధించిన సమావేశాలు సానుకూలంగా ఫలితాలు ఇస్తాయని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు.