ఆరోగ్య తెలంగాణ లక్ష్య సాధనకు కృషి చేయాలి: మంత్రి హరీశ్
రథ సారథి, హైదరాబాద్:
హైదరాబాదులో ఈరోజు జరిగిన తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం హెచ్1 యూనియన్ రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించిన క్యాలెండర్ ను ఆర్థిక, వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే వినూత్నమైన ఆరోగ్య పథకాలను ప్రజలకు చేరవేయడానికి కృషి చేస్తుందని, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో వైద్య ఉద్యోగులు మరింతగా కృషి చేయాలని కోరారు. వైద్య ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ విషయాన్ని యూనియన్ నాయకులు బాధ్యతతో మెలుగుతూ ఉద్యోగులకు చెప్పాలని కోరారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ప్రజారోగ్య వైద్య సిబ్బందిని ఆయన ప్రశంసిస్తూ, ఈ కార్యక్రమం పూర్తిగా విజయవంతం చేసే వరకు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా వైద్య ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను యూనియన్ నాయకులు మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్నాటి సాయి రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, బిఆర్ఎస్కెవి రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రూప్సింగ్, యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు భూతరాజు సైదులు, నల్గొండ జిల్లా అధ్యక్షులు కొంపెల్లి మత్స్యగిరి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి శుభకరం మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు పాల్గొన్నారు.