స్వామి మృతి పట్ల ఎమ్మెల్యే భాస్కర్ రావు సంతాపం
రథ సారథి, మిర్యాలగూడ:
ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి (32) మృతి పట్ల మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పుట్టుకతో ఫ్లోరోసిస్ బాధితుడిగా ఉన్న అంశాల స్వామి తన మనోధైర్యంతో భవితరాలు ఫ్లోరోసిస్ బారినపడకూడదని, నల్లగొండ జిల్లాలో ఇకపై ఫ్లోరోసిస్ వ్యాధి బారినపడినవారి ఒక్క కేసు కూడా నమోదు కాకూడదని పోరాటాన్ని ఉధృతం చేసిన మహానీయుడని అన్నారు. ఫ్లోరోసిస్ రక్కసిని తరిమికొట్టాలని అవిశ్రాంతంగా పోరాడి ఢిల్లీ పెద్దల ముందు సైతం ఫ్లోరోసిస్కి వ్యతిరేకంగా తన గళం వినిపించిన ధీశాలి స్వామి అని, ఆయన మృతి తనను ఎంతో కలచివేసిందనిని నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్టు పేర్కొన్నారు.