మనిషి మనుగడకు దైవచింతనే ప్రధానం: చిన జీయర్ స్వామి
రథసారథి ,మిర్యాలగూడ:
మనిషి మనుగడకు దైవచింతనే ఎంతో ప్రధానమని శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామీజీ పేర్కొన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంపు గ్రౌండ్లో బుధవారం సాయంత్రం భీష్మ ఏకాదశి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన భక్తజనుల ఉద్దేశించి ప్రసంగించారు . అందరూ నిత్యం దైవ పారాయణం చేపట్టాలన్నారు .ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ విష్ణు సహస్రనామ పారాయణం చేపట్టవచ్చునన్నారు. మనిషి తన కోపాన్ని అధిగమించేందుకు విష్ణు సహస్రనామ పఠనం ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. విష్ణు సహస్రనామ పారాయణలో పలు శ్లోకాలు రోగాలను సైతం తగ్గిస్తాయి అన్నారు. రామానుజుల వారు చూపించిన సమతా మార్గం ప్రపంచ మానవాళికి ఆదర్శం అన్నారు .ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేపట్టి దాని ప్రాముఖ్యతను, ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ నాగలక్ష్మి దంపతులు, రాష్ట్ర రైస్ మిల్లర్స్ ఉపాధ్యక్షుడు కర్ణాటి రమేష్ దంపతులు, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్ దంపతులు, భోగవిల్లి వెంకటరమణ చౌదరి, పట్టణ ప్రముఖులు, భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు.