భవిష్యత్ తరాలకు ఆహ్లాదకర వాతావరణం ఇవ్వాలి: మంత్రి తలసాని
రథసారథి, హైదరాబాద్:
భవిష్యత్ తరాలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదని, ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం హైదరాబాద్ పి.వి. మార్గ్ లోని పీపుల్స్ ప్లాజా లో ఏర్పాటు చేసిన నర్సరీ మేళా ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి తీసుకొచ్చిన మొక్కల తో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి మొక్కలను పరిశీలించారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం, రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం అనే గొప్ప కార్యక్రమం చేపట్టి ప్రతి సంవత్సరం కోట్లాది మొక్కలను నాటుతున్న విషయాన్ని గుర్తుచేశారు. నేడు మనం మొక్కలను నాటడం వలన భవిష్యత్ తరాలకు మేలు చేసిన వారంఅవుతామని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో లభించే అనేక రకాల మొక్కలు ఒకే చోట లభించే విధంగా గ్రాండ్ నర్సరీ మేళా ను ఏర్పాటు చేయడం పట్ల నిర్వాహకులను మంత్రి అభినందించారు.