సకాలంలో జీతాలు చెల్లించాలి
రథ సారథి,మిర్యాలగూడ:
తొమ్మిదో తారీఖు వచ్చి నా కూడా జీతాలు రాక నెల నెల చెల్లించాల్సిన బకాయిలు ఇబ్బంది పెడుతున్నాయి అనీ ఉపాధ్యాయ సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుడిపాటి కోటయ్య ఆవేదన వ్యక్తంచేశారు. పాల బిల్లు, ఇంటి అద్దె, బ్యాంకు రుణాలు, కుటుంబ ఖర్చులు, పిల్లల ఫీజులు తదితర విషయాలు ఇబ్బంది పెడుతున్నా బయటి సమాజంలో ఉద్యోగులు మీకేంటి అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటిని భరిస్తూ ప్రజాసేవలో ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో ఉద్యోగులు, భావి భారత పౌరుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు తలమునకులై ఉన్నా కూడ తెలియకుండానే జీతం రాలేదనే బాధ కుంగదీస్తుంద న్నారు. తెలంగాణ ఆవిర్భావ సందర్భంలో దేశంలోనే అత్యంతధనవంతమైనటువంటి రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నేడు అప్పులమయమై ఉద్యోగుల జీతాలు ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలకు డబ్బులు లేక బంగారు తెలంగాణ కాస్త బాధల తెలంగాణగా మారింద న్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ విషయాలన్నింటినీ పరిశీలించి ప్రజలకు న్యాయం చేయాలని, ఉద్యోగుల,ఉపాధ్యాయుల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాలి జగన్మోహన్, ఏలేటి వినోద్ కుమార్, కుంచారపు శ్రీధర్ కుమార్, లగీశెట్టి చైతన్య లతా, నల్ల మేకల వెంకయ్య, చాడ విజయనిర్మల, వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.