బీసీలంతా ఏకమయ్యే సమయం వచ్చింది.. తిరుమలగిరి అశోక్
రథసారథి ,మిర్యాలగూడ :
తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా ఒకటిగా కలిసి పోరాట దిశగా ముందుకు సాగాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ పిలుపునిచ్చారు. మిర్యాలగూడలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బీసీలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని ఇప్పటివరకు ఏ ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బీసీ ఓట్లే ఉన్నప్పటికీ కూడా రాజకీయ పార్టీలు బీసీల ఓట్లు ఏ విధంగా దండుకోవాలో అని ఆలోచిస్తున్నాయి తప్ప బీసీలకు పార్టీలు సముచిత స్థానాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆయన అన్నారు. బీసీలను ఓటు బ్యాంకు గానే చూసే కొన్ని రాజకీయ పార్టీలకు త్వరలోనే బీసీ ఉద్యమం ద్వారా తగిన గుణపాఠం చెప్తామని ఆయన హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తరహాలో త్వరలో తెలంగాణలో మరో బీసీల ఉద్యమం ప్రారంభమవుతుందని ఈ ఉద్యమానికి బీసీ లందరూ పార్టీలకతీతంగా ముందుకు వచ్చి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడమే కాక మన హక్కులను మనం కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటికీ కూడా బీసీలను తీవ్రంగా అణిచివేతకు గురి చేస్తున్నారు అని, కాబట్టి బీసీలరా ఇకనైనా మేలుకుందాం బీసీల ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని బీసీల సత్తా ఏంటో ప్రభుత్వానికి చాటేలా ఉద్యమానికి సిద్ధం కావాలి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి గంగాధర్, అనిల్, గోవాడ కిరణ్, సైదులు, మహేష్, నరేష్, వేణు , సురేష్ తదితరులు పాల్గొన్నారు.