చెవిలో పువ్వులతో ఎస్ఎస్ఏ ఉద్యోగుల నిరసన
రథసారధి, నల్లగొండ :
తమ డిమాండ్ల సాధన కోసం నల్గొండ కలెక్టరేట్ ఎదుట గత ఏడు రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు సోమవారం వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులందరూ చెవిలో పూలు పెట్టుకొని ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేశారు. సుమారుగా 20 ఏళ్ల నుండి సర్వ శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న తాము వెట్టి చాకిరికి గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను రెగ్యులర్ చేయాలన్న ప్రధానాంశంతో తమ సమ్మె కొనసాగిస్తున్నామని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. గ తేడాది సెప్టెంబర్ 13న ప్రతిపక్ష హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులరైజ్ చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనాన్ని తమకు కల్పించాలని వారు కోరారు .ఈ సందర్భంగా మహిళా,పురుష
ఉద్యోగస్తులు వారి వారి పిల్లల తోటి, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. తమను రెగ్యులరైజ్ చేసే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు తాము సమ్మె కొనసాగిస్తామని ఎస్ఎస్ఏ జిల్లా నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. వీరి సమ్మెకు సిపిఎం తోపాటుగా పలు సంఘాల నాయకులు తమ సంపూర్ణ మద్దతు పలికారు. ఈ సమ్మెలో ఎస్ఎస్ఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మొగులూరు కృష్ణ, బొమ్మగాని రాజు, రాష్ట్ర ప్రతినిధులు క్రాంతి కుమార్, కంచర్ల మహేందర్, నీలాంబరి, జిల్లాలోని ఆయా మండలాల నుండి పెద్ద ఎత్తున సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు పాల్గొన్నారు.