మూడో రోజూ.. వైభవంగా శ్రీమద్రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు

నేడు ప్రధాని చేతుల మీదుగా సమతా మూర్తిని జాతికి అంకితం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 04 : శంషాబాద్‌ ‌ముచ్చింతల్‌ ‌శ్రీరామనగరంలో భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల్లో కీలక ఘట్టం 216 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ నేడు జరగనుంది. భారత ప్రధాని నరేంద్రమోదీ శనివారం మధ్యాహ్నం సమతామూర్తిని జాతికి అంకితం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రధాని రాకను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పీఎం పర్యటన నేపథ్యంలో శ్రీరామ నగర పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను సిఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌, ‌డిజిపి మహేందర్‌ ‌రెడ్డి పరిశీలించారు. హెలీప్యాడ్‌, ‌సమతామూర్తి ప్రాంగణం, యాగశాలల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యాగశాల చుట్టూ మెటల్‌ ‌డిటెక్టర్లను అమర్చారు. ముచ్చింతల్‌ ‌శ్రీరామనగరం పూర్తిగా పోలీసుల పహారాలో ఉంది. డిజిపి మహేందర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని రాక సందర్భంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసామని… భక్తులు సహకరించాలని… కొవిడ్‌ ‌నియమాలను పాటించాలని సూచించారు. మూడో రోజు కార్యక్రమంలో భాగంగా యాగశాలలో అష్టాక్షరీ మహామంత్ర జపంతో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆపై హోమాలు, చతుర్వేద పారాయణాలను నిర్వహించారు. 5 వేల మంది రుత్విజులు శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువును కొనసాగించారు. తెలుగు రాష్ట్రాలతో పాటూ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్రాల నుంచి విచ్చేసిన వేదపండితులచే వేదపారాయణం అంగరంగ వైభవంగా జరిగంది. యాగంలో 10 మంది జీయర్‌ ‌స్వాములు పాల్గొన్నారు. శ్రీలక్ష్మీ నారాయణ క్రతువులో భాగంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ ‌స్వామి నిత్య ఆరాధనాగోష్ఠిని నిర్వహించారు.

ఈ కార్యక్రమం ఆసాంతం మైహోమ్‌ ‌గ్రూప్‌ ‌సంస్థల అధినేత డాక్టర్‌ ‌జూపల్లి రామేశ్వరరావు పాల్గొన్నారు. ప్రవచన మండపంలో ఈరోజు చిన్నజీయర్‌ ‌స్వామి వారి ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామావళి పూజను భక్తులచే నిర్వహింపజేసారు. భక్తులు ఈ కార్యక్రమంలో స్వామివారి ఉపదేశానుసారం భక్తిశ్రద్ధలతో పూజలో పాల్గొన్నారు. అయోధ్య నుంచి విచ్చేసిన శ్రీవిద్యాసాగర స్వామి సంస్కృతంలో రామానుజ స్వామి వారి విశిష్టతను, శ్రీరామ నగర విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నేపాల్‌ ‌కృష్ణమాచార్యులు కూడా పాల్గొన్నారు. భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ స్థానాచార్యులు ప్రవచనకర్త శ్రీమాన్‌ ‌స్థలసాయి రామానుజ వైభవంపై ప్రవచనాన్ని అందించారు. ఆ తర్వాత రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ ప్రవచనకర్త రంగనాథ భట్టర్‌ ‌వారిచే రామానుజుల దివ్య ప్రవచనాన్ని అందించారు.

అనంతరం ప్రవచన మండపంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రజ్ఞా మనోజ్ఞ సంగీతం, పేరిందేవి బృందం నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమ సుమిత సంగీతం, మానస బృందంవారి భజన కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ప్రవచన మండపంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ ‌స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ జరిగింది. యాగశాలలో సాయంత్ర హోమాలు శాస్త్రోకంగా జరిగాయి. లక్ష్మీనారాయణ క్రతువులో భాగంగా చతుర్వేద పారాయణాలు వేదపండితులచే ఘనంగా నిర్వహించారు. రేపటి కార్యక్రమంలో భాగంగా వసంత పంచమి శుభవేళ విజయప్రాప్తికై విశ్వక్సేనేష్టి, విద్యాప్రాప్తికై హయగ్రేవేష్టి యాగశాలలో జరుగనున్నాయి. ప్రవచన మండపంలో శనివారం సందర్భంగా శ్రీవేంకటేశ్వర అష్టోత్తర శతనామ పూజ శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ ‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగనున్నాయి. రేపు ప్రధాని మోదీ… 216 అడుగుల సమతామూర్తిని జాతికి అంకితమిచ్చే కీలక ఘట్టం కోసం భక్తజనం ఎదురుచూస్తుంది.

Post bottom

Leave A Reply

Your email address will not be published.