ఓల్డ్‌సిటీ ప్రైవేట్ స్కూల్‌లో వివాదం.. రెండో తరగతి విద్యార్థికి మతపరమైన హోంవర్క్ ఇచ్చారన్న ఆరోపణలు
హైదరాబాద్ పాతబస్తీలోని సైదాబాద్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న హిందూ విద్యార్థికి మతపరమైన పాఠాలను హోంవర్క్‌గా ఇచ్చారన్న ఆరోపణలు వివాదానికి దారితీశాయి.

హైదరాబాద్ పాతబస్తీలోని సైదాబాద్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న హిందూ విద్యార్థికి మతపరమైన పాఠాలను హోంవర్క్‌గా ఇచ్చారన్న ఆరోపణలు వివాదానికి దారితీశాయి. విద్యార్థి స్కూల్ డైరీలో కల్మా, సూరా ఫాతిహా చదవాలని హోంవర్క్ రాసి ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. తమ చిన్నారికి ఇలాంటి మతపరమైన హోంవర్క్ ఎలా ఇస్తారని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విషయం రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ, ఏబీవీపీ నాయకులు పాఠశాల వద్దకు చేరుకుని నిరసనకు దిగేందుకు ప్రయత్నించగా, పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాఠశాల ముట్టడికి యత్నించిన పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు స్పందిస్తూ, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పాఠశాల యాజమాన్యం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు కూడా ఘటనపై స్పందిస్తూ, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
మరోవైపు, ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది. హోంవర్క్ ఇచ్చిన ఉపాధ్యాయుడిని అదే రోజు విధుల నుంచి తొలగించినట్లు తెలిపింది. ఈ వ్యవహారంలో యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా ఉపాధ్యాయుడి వ్యక్తిగత తప్పిదమని పేర్కొంది. తమ పాఠశాలలో ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదని, వివాదం అనంతరం విద్యార్థి తండ్రితో మాట్లాడి విషయాన్ని వివరించినట్లు వెల్లడించింది.
ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు కూడా స్పందించారు. పాఠశాలలో తనిఖీలు నిర్వహించి, పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. విచారణ అనంతరం వాస్తవాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
