మన స్కూల్ బస్సు భద్రమేనా..?
నిత్యం ఓవర్ లోడ్ తో స్కూల్ బస్సులు -పిల్లల ప్రాణాలతో చెలగాటం.. -సెలవు దినాల ముందు రోజు స్కూల్ బస్సుల ఓవర్ లోడ్ ట్రిప్పులు -నిబంధనలు ఉన్నా అమలు శూన్యం..

తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు, అధికారులు కలిసి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం
సంగారెడ్డి, జూలై 16 (ప్రత్యేక ప్రతినిధి):
కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా విద్యార్థుల రవాణా భద్రతపై ఇంకా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మన స్కూల్ బస్సు నిజంగా భద్రమేనా? అనే ప్రశ్న ప్రతి తల్లిదండ్రిని కలవరపెడుతోంది. ఒకవైపు ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు, మరోవైపు సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించుకుంటున్న ఆటోలు, ప్రైవేట్ వ్యాన్లు పిల్లల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి.
నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుస్తున్న వాహనాలపై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి పట్టణంతో పాటు జిల్లా కేంద్రాలు, మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల రవాణాకు ఆటోలు, మ్యాజిక్ వ్యాన్లు, చిన్న ప్రైవేట్ వాహనాలనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే కొందరు వాహన యజమానులు కొద్దిపాటి లాభం కోసం సామర్థ్యానికి మించి పిల్లలను కుక్కి మరీ తీసుకెళ్తున్నారు. నలుగురు లేదా ఐదుగురు కూర్చోవాల్సిన ఆటోలో పది నుంచి పన్నెండు మందికి పైగా విద్యార్థులను ఎక్కించడం, డ్రైవర్ సీటుకు ఇరువైపులా చిన్నారులను కూర్చోబెట్టడం, స్కూల్ బ్యాగులను వాహనం బయటకు వేలాడదీయడం వంటి దృశ్యాలు ప్రతిరోజూ కనిపిస్తున్నాయి. చిన్న ప్రమాదం జరిగినా అమాయక చిన్నారుల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ఈ ప్రమాదకర ప్రయాణాలు యథావిధిగా కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయి
విద్యార్థులను రవాణా చేసే అన్ని విద్యాసంస్థల బస్సులు, వ్యాన్లు, ఇతర వాహనాలకు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలని రవాణా శాఖ స్పష్టం చేసింది. జూన్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తోంది.
-తనిఖీల్లో అధికారులు పరిశీలిస్తున్న అంశాలు
* చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ సర్టిఫికెట్
* పర్మిట్, బీమా, కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ
* డ్రైవర్‌కు సరైన డ్రైవింగ్ లైసెన్స్, తగిన అనుభవం
* విద్యార్థుల కోసం ప్రత్యేక అటెండర్ నియామకం
* ఫస్ట్ ఎయిడ్ బాక్స్
* అగ్నిమాపక పరికరాలు
* అత్యవసర నిష్క్రమణ (ఎమర్జెన్సీ ఎగ్జిట్)
* సీసీ కెమెరాలు, జీపీఎస్ వంటి భద్రతా ఏర్పాట్లు
* వాహన సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించకపోవడం
తల్లిదండ్రుల బాధ్యత కూడా అంతే ముఖ్యం
విద్యార్థుల భద్రత విషయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకమని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్కూల్ ఫీజుల కోసం వేల రూపాయలు వెచ్చించే తల్లిదండ్రులు, పిల్లల రవాణా భద్రత విషయంలో మాత్రం ఎందుకు రాజీపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలు ప్రయాణించే ఆటో లేదా వ్యాన్‌లో అధిక సంఖ్యలో విద్యార్థులను ఎక్కిస్తున్నారని తెలిసినా అదే వాహనంలో పంపించడం సరైన నిర్ణయం కాదని వారు సూచిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే అప్రమత్తంగా ఉండడం అవసరమని చెబుతున్నారు.
-హాఫ్‌డే రోజుల్లో అధిక రద్దీ
సెలవులకు ముందు రోజు హాఫ్‌డే ఉన్నప్పుడు, అకస్మాత్తుగా ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పుడు లేదా ప్రత్యేక సందర్భాల్లో కొన్ని పాఠశాలలు అదనపు ట్రిప్పులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఒకే బస్సులో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించి పంపిస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో పిల్లలు నిలబడి ప్రయాణించడం, సీట్లకు మించి విద్యార్థులను కూర్చోబెట్టడం, భద్రతా ప్రమాణాలను పూర్తిగా విస్మరించడం తరచూ కనిపిస్తోందని పేర్కొంటున్నారు.
పాఠశాల యాజమాన్యాలు అప్రమత్తం కావాలి.
విద్యార్థులు బడికి ఎలా వస్తున్నారు? ఏ వాహనంలో ప్రయాణిస్తున్నారు? అది సురక్షితమా? అనే అంశాలను ప్రతి పాఠశాల యాజమాన్యం నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి సురక్షిత రవాణాపై అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.
-కఠిన చర్యలు తప్పవు
ఫిట్నెస్ లేకుండా నడిచే స్కూల్ బస్సులు, సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించుకునే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను సీజ్ చేయడంతో పాటు మోటారు వాహన చట్టం ప్రకారం వాహన యజమానులు, డ్రైవర్లు, సంబంధిత విద్యాసంస్థల యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
-భద్రత అందరి బాధ్యత
విద్యార్థుల సురక్షిత ప్రయాణం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. పాఠశాల యాజమాన్యాలు, వాహన యజమానులు, డ్రైవర్లు, తల్లిదండ్రులు, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రమాదాలను నివారించవచ్చు. పిల్లల ప్రాణాల కంటే ఏ లాభమూ గొప్పది కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు


