Sangareddy

సంగారెడ్డిలో వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర

రథయాత్రకు శ్రీకారం చుట్టిన జగ్గారెడ్డి.. భజనలు, కోలాటాలతో భక్తిమయమైన పట్టణ వీధులు

అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు.

కొత్త బస్టాండ్ వద్ద ప్రారంభమైన రథయాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల గుండా పీఎస్‌ఆర్ గార్డెన్ వరకు ఘనంగా సాగింది. రథం వెంట పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని హరినామ సంకీర్తనలు చేస్తూ, హరే కృష్ణ, జగన్నాథ్ స్వామికి జై నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. యాత్ర సందర్భంగా ఇస్కాన్ భక్తులు నిర్వహించిన భజనలు, కీర్తనలు, ఆధ్యాత్మిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు ప్రదర్శించిన కోలాటం భక్తులను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మార్గమధ్యంలో భక్తులకు నిర్వాహకులు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగ్గారెడ్డి, సంగారెడ్డిలో ప్రతి ఏడాది జగన్నాథ రథయాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ ఆధ్యాత్మిక విలువలను ప్రజల్లో పెంపొందిస్తున్న ఇస్కాన్ ప్రతినిధులను అభినందించారు. అనంతరం భక్తులతో కలిసి హరినామ సంకీర్తనలో పాల్గొని భక్తిగీతాలు ఆలపిస్తూ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, ఇస్కాన్ ప్రతినిధులు, వివిధ ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, మహిళలు, యువకులు సహా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button