సంగారెడ్డి గురుకులాల్లో పార్ట్‌టైం టీచర్ల నియామకం
ఈ నెల 18లోగా దరఖాస్తులు.. 22న డెమో, ఇంటర్వ్యూలు
సంగారెడ్డి ప్రతినిధి, జూలై 16 రథసారథి న్యూస్): సంగారెడ్డి జిల్లా పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన పార్ట్‌టైం టీచర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ (శనివారం) సాయంత్రం 4 గంటలలోపు తమ దరఖాస్తులను *టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్/జీసీఓఈ, చిట్కుల్ (సంగారెడ్డి జిల్లా)*లో సమర్పించాల్సి ఉంటుంది.
ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, కొత్త అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ (బుధవారం) ఉదయం 10 గంటలకు తమ విద్యార్హతల ఒరిజినల్ ధ్రువపత్రాలు, రెండు తాజా పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో చిట్కుల్లోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో నిర్వహించే డెమో, ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.
నియామక ప్రక్రియకు సంబంధించిన ఇతర వివరాల కోసం జిల్లా సమన్వయ అధికారి, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), చిట్కుల్ కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.



