Sangareddy

జిన్నారం సర్కిల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

నాణ్యమైన దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, నేరాల నియంత్రణపై అధికారులకు దిశానిర్దేశం

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 16 (రథసారధి న్యూస్):

వార్షిక తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) పరితోష్ పంకజ్ గురువారం జిన్నారం సర్కిల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిన్నారం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన, పటాన్‌చెరువు డీఎస్పీ ప్రభాకర్‌తో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు.

అనంతరం స్టేషన్ ఆవరణ పరిశుభ్రత, సిబ్బంది బ్యారక్స్, రికార్డుల నిర్వహణ, పోలీసు సిబ్బందికి అందజేసిన కిట్ సామగ్రి వినియోగాన్ని పరిశీలించారు. కేసులకు సంబంధించిన స్వాధీనం చేసుకున్న వాహనాలను సకాలంలో కోర్టులో డిపాజిట్ చేయడంతో పాటు, యజమానులు లేని వాహనాలను నిబంధనల ప్రకారం బహిరంగ వేలం ద్వారా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్ రికార్డులను పరిశీలించిన ఎస్పీ, ప్రతి కేసులో నాణ్యమైన, నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు.

అన్ని రికార్డులను సీసీటీఎన్‌ఎస్-2.0లో ఎప్పటికప్పుడు నమోదు చేసి నవీకరించాలని, విలేజ్ పోలీసు అధికారులు తమ పరిధిలోని గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి గ్రామ పెద్దలు, యువతతో సమన్వయం పెంచుకుని శాంతిభద్రతలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని సూచించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, బీట్ విధుల్లో తరచూ తనిఖీలు నిర్వహించి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.

జిన్నారం ప్రాంతంలో పరిశ్రమలు అధికంగా ఉండటంతో వలస కార్మికుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయని, ఆస్తి సంబంధిత నేరాల నివారణకు క్రైమ్ ప్రోన్ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించి స్వచ్ఛందంగా కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. తదుపరి సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎస్పీ, గ్రేవ్ కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని, సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసి ఎలాంటి రికార్డులు పెండింగ్‌లో లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పోలీసు సిబ్బందితో సమావేశమైన పరితోష్ పంకజ్, యువ కానిస్టేబుళ్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని భవిష్యత్తులో స్టేషన్ రైటర్లుగా ఎదగాలని సూచించారు.

సీసీటీఎన్‌ఎస్-2.0, టీఎస్-కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ-సాక్ష్య, సైబర్ క్రైమ్ పోర్టల్, సీఈఐఆర్, సీడీఆర్, పోర్టబుల్ ఫింగర్‌ప్రింట్ డివైస్ తదితర ఆధునిక సాఫ్ట్‌వేర్‌లపై పూర్తి అవగాహన పెంపొందించుకుని నేరాల నియంత్రణలో సమర్థవంతంగా పనిచేయాలని పేర్కొన్నారు. స్టేషన్‌లో పార్ట్-1 నుంచి పార్ట్-5 వరకు అన్ని రికార్డులను ఎలాంటి పెండింగ్ లేకుండా నిర్వహించాలని, సిబ్బందికి వర్టికల్ వారీగా విధులు కేటాయించాలని ఎస్‌హెచ్‌ఓకు సూచించారు. జిన్నారం సర్కిల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, విధుల నిర్వహణలో మరింత కృషి చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎస్పీ సూచించారు. ఈ తనిఖీల సందర్భంగా పటాన్‌చెరువు డీఎస్పీ ప్రభాకర్, జిన్నారం సీఐ పి. రమణారెడ్డి, ఎస్‌హెచ్‌ఓ హనుమంతు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button