Sangareddy

గ్రామీణాభివృద్ధి పనుల్లో జాప్యానికి తావివ్వొద్దు

ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి – జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 16 (రథసారథి న్యూస్):

జిల్లాలో చేపడుతున్న గ్రామీణాభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని, ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాల అమలులో అధికారులు సమన్వయంతో, నిబద్ధతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఎల్పీవోలు, డీపీఎంలు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏపీఓలు, ఏపీఎంలు, పంచాయతీరాజ్ ఈఈలు, డీఈలు, ఏఈలు తదితర అధికారులతో వివో భవనాలు, గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు, పాఠశాల మరుగుదొడ్లు, కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్‌లు (సి ఎస్ సి లు), వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు , ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, పాఠశాల కాంపౌండ్ వాల్స్, కల్వర్టులు, డ్రైనేజీ పనులు, ఎస్‌హెచ్‌జీ ఫెడరేషన్ భవనాలు, తాగునీటి సరఫరా తదితర అంశాలపై మండలాల వారీగా సమగ్ర సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వివో భవనాల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్‌ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు నిరంతరాయంగా సురక్షిత తాగునీరు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

పాఠశాలల్లో ఉన్న మరుగుదొడ్లను పూర్తిస్థాయిలో వినియోగానికి అనుకూలంగా ఉండేలా స్ట్రీమ్‌లైన్ చేయాలని, మరుగుదొడ్లు అవసరమైన పాఠశాలలకు కొత్త టాయిలెట్ల నిర్మాణానికి సంబంధించిన అంచనా ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి సమర్పించాలని ఆదేశించారు. అలాగే అవసరమైన పాఠశాలల్లో కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు అంచనా ప్రణాళికలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. గ్రామీణాభివృద్ధిలో ఎంపీడీవోల పాత్ర అత్యంత కీలకమని , మండల స్థాయిలో అన్ని శాఖల అధికారులతో తరచూ సమీక్షలు నిర్వహించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. డివిజన్ స్థాయిలో డివిజనల్ పంచాయతీ అధికారులు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి అభివృద్ధి పనిని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పాండు, డీఆర్‌డీఓ జ్యోతి, జెడ్పీ సీఈవో జానకి రెడ్డి, ఇన్‌చార్జి సీపీఓ జగదీష్, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button