Uncategorized

ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలి

సీజనల్ వ్యాధుల నివారణకు అప్రమత్తంగా ఉండాలి -తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలి – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 16 (రథసారధి న్యూస్):

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులను తక్కువ నీటితో, తక్కువ కాలంలో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

అలాగే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గురువారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో జిల్లాల వారీగా వర్షపాత పరిస్థితులు, పంటల సాగు, ప్రజారోగ్యం, తాగునీటి సరఫరా, సాగునీటి నిర్వహణ, విద్య, వాతావరణ మార్పుల ప్రభావం, ప్రజాపాలన తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవగాహన కల్పిస్తూ తక్కువ నీటితో, స్వల్ప వ్యవధిలో దిగుబడి ఇచ్చే ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. వర్షాకాలంలో డెంగ్యూ, చికున్‌గున్యా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా వైద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ప్రజలకు తాగునీటి కొరత తలెత్తకుండా అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా తాగునీటి సరఫరా జరిగేలా ముందస్తు కార్యాచరణ చేపట్టాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు, సాగులో ఉన్న పంటల పరిస్థితి, సీజనల్ వ్యాధుల నివారణకు చేపడుతున్న చర్యలు, తాగునీటి సరఫరా, అందుబాటులో ఉన్న నీటి వనరులు, సింగూరు జలాశయం మరమ్మతుల పురోగతి తదితర అంశాలను ప్రధాన కార్యదర్శికి వివరించారు. సింగూరు జలాశయంలో మరమ్మతు పనులు కొనసాగుతున్నప్పటికీ పనుల పురోగతి ఆశించిన స్థాయిలో లేదని కలెక్టర్ తెలిపారు.

తాగునీటి అవసరాల దృష్ట్యా మరమ్మతు పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శిని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ పాండు, జెడ్పీ సీఈవో జానకి రెడ్డి, డీఆర్‌డీఓ జ్యోతి, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్య, వ్యవసాయ, విద్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button