కాలుష్య కోరల్లో హైదరాబాద్ – సంగారెడ్డి.. గాలి నాణ్యతపై ఆందోళన
పారిశ్రామిక ఉద్గారాలు, వాహనాల పొగ, రోడ్లపై దుమ్ముతో పెరుగుతున్న ముప్పు

-జాతీయ ప్రమాణాలను మించిన సూక్ష్మ ధూళికణాలు..
-పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం..
-కాలుష్య నివారణకు సమగ్ర చర్యలు అవసరం
హైదరాబాద్ ప్రతినిధి, నవంబర్ 2 (రథసారథి న్యూస్):
పారిశ్రామిక అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్న హైదరాబాద్ తో పాటు సంగారెడ్డి జిల్లాలో వాయు కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలు, వాహనాల పొగ, రహదారులపై పేరుకుపోతున్న ధూళి, నిర్మాణ పనులు, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను దహనం చేయడం వంటి కారణాలతో గాలి నాణ్యత దెబ్బతింటోంది. సాయంత్రం రాత్రి ఉదయం వేళలో కాలుష్య వాయువులు వెలువడటంతో పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఊపిరి పీల్చడం ఇబ్బందికరంగా మారింది. చిన్నపిల్లలు, వృద్ధులు, చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితి ఇంకా చెప్పరాదు. కొన్ని రోజులుగా సాయంకాల వేలల్లో సంగారెడ్డి వరకు ఫ్యాక్టరీల నుండి వెలువడే ఘాటైన వాసనలతో ఆరుబయట తిరగలేని పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్‌తోపాటు సంగారెడ్డి ప్రాంతాల్లోనూ సూక్ష్మ ధూళికణాల స్థాయులు జాతీయ ప్రమాణాలను మించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అందుబాటులో ఉన్న 2025–26 వార్షిక సగటు గణాంకాల ప్రకారం, సంగారెడ్డిలో పీఎం-10 స్థాయి క్యూబిక్ మీటరు గాలికి 78 మైక్రోగ్రాములుగా నమోదైంది. ఇది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన వార్షిక ప్రమాణమైన 60 మైక్రోగ్రాముల కంటే 30 శాతం అధికం. హైదరాబాద్‌లో ఈ స్థాయి 80 మైక్రోగ్రాములుగా నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన వార్షిక మార్గదర్శక పరిమితి క్యూబిక్ మీటరుకు 15 మైక్రోగ్రాములతో పోలిస్తే ఈ స్థాయులు మరింత ఎక్కువగా ఉన్నాయి. దీంతో సంగారెడ్డి జిల్లాలో వాయు కాలుష్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.
-పారిశ్రామిక ప్రాంతాల నుంచి కాలుష్య ఉద్గారాలు
జిల్లాలోని పటాన్చెరు, బొల్లారం వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశ్రమల నుంచి వెలువడే పొగ, వాయు ఉద్గారాలు గాలి నాణ్యతపై ప్రభావం చూపే ప్రధాన అంశాలుగా ఉన్నాయి. మరోవైపు హైదరాబాద్–ముంబై జాతీయ రహదారిపై పెరుగుతున్న వాహనాల రాకపోకలు, రహదారుల నిర్మాణం, భవన నిర్మాణ పనుల వల్ల గాలిలో ధూళికణాలు కలుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను బహిరంగంగా తగులబెట్టడం వల్ల వెలువడే పొగ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. పారిశ్రామిక ప్రాంతాలతోపాటు నివాస కాలనీల్లోనూ గాలి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.
-సూక్ష్మ ధూళికణాలతో ఆరోగ్య సమస్యలు
గాలిలో ఉండే పీఎం-10, పీఎం-2.5 సూక్ష్మ ధూళికణాలు ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పీఎం-2.5 కణాలు అతి సూక్ష్మంగా ఉండటంతో ఊపిరితిత్తుల లోతైన భాగాల్లోకి చేరగలవు. కాలుష్యానికి దీర్ఘకాలం గురికావడం వల్ల శ్వాసకోశ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారితోపాటు చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. కళ్ల మంట, గొంతులో ఇబ్బంది, దగ్గు, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుల సలహా తీసుకోవాలి.
-నివారణ చర్యలు చేపట్టాల్సిందే
వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ పరికరాల పనితీరును నిరంతరం తనిఖీ చేయాలి. నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై తగిన చర్యలు తీసుకోవాలి. ప్రధాన రహదారులు, నిర్మాణ ప్రాంతాల్లో ధూళి వ్యాప్తిని తగ్గించే చర్యలు చేపట్టడంతోపాటు, చెత్తను బహిరంగంగా తగలబెట్టకుండా పర్యవేక్షణ పెంచాలి. ప్రజా రవాణాను ప్రోత్సహించడం, వాహనాల నుంచి వెలువడే పొగను నియంత్రించడం, పచ్చదనాన్ని పెంపొందించడం కూడా కీలకం. కాలుష్య స్థాయులపై ప్రజలకు ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం అందుబాటులో ఉంచాలి.
-ప్రజల భాగస్వామ్యమూ అవసరమే
కాలుష్య నియంత్రణ బాధ్యత ప్రభుత్వ శాఖలకే పరిమితం కాకుండా ప్రజలు కూడా భాగస్వాములు కావాలి. చెత్తను తగలబెట్టకుండా, వాహనాలను అవసరమైనప్పుడు మాత్రమే వినియోగిస్తూ, మొక్కలను పెంచుతూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలి. గాలి నాణ్యత సూచీ ప్రమాదకర స్థాయికి చేరినప్పుడు బయట చేసే శారీరక శ్రమను తగ్గించడం, అవసరమైతే తగిన రక్షణ ముసుగులు ధరించడం వంటి జాగ్రత్తలు పాటించాలి. పారిశ్రామిక అభివృద్ధితోపాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి, నిరంతర పర్యవేక్షణతో పాటు సమర్థవంతమైన నివారణ చర్యలు చేపట్టినప్పుడే ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందుబాటులోకి వస్తుంది.



