Sangareddy

జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలి

విధి నిర్వహణలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపైనా శ్రద్ధ చూపాలి

-ఉచిత వైద్య శిబిరాన్ని అభినందించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబర్ 14 (రథసారథి న్యూస్)

నిత్యం ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, విధి నిర్వహణలో నిరంతరం శ్రమించే జర్నలిస్టులు తమ ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. పని ఒత్తిడి, సమయాభావం కారణంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా బుధవారం సంగారెడ్డిలోని సన్‌రైజ్ ఆసుపత్రిలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి, నిర్వాహకులను అభినందించారు. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో, సన్‌రైజ్ ఆసుపత్రి, రథసారథి తెలుగు దినపత్రిక సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. సమాజానికి నిరంతరం సేవలందించే జర్నలిస్టులు తమ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స పొందడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు. జర్నలిస్టులు తమతోపాటు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

-పలువురు వైద్య నిపుణులతో పరీక్షలు

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగిన ఈ శిబిరంలో సన్‌రైజ్ ఆసుపత్రికి చెందిన వివిధ విభాగాల వైద్య నిపుణులు పాల్గొని జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, ఎముకలు, కీళ్లు, మెదడు, నాడీ సంబంధిత సమస్యలతోపాటు చిన్నపిల్లలు, మహిళలు, ఇతర సాధారణ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య సేవలు అందించారు. అవసరమైన వారికి గుండె విద్యుత్ పరీక్ష (ఈసీజీ), ద్విమితీయ గుండె చిత్రీకరణ పరీక్ష (2డీ ఎకో), రక్త పరీక్షలు నిర్వహించి, తగిన వైద్య సలహాలు అందజేశారు. అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్, కేబుల్, మీడియా చెందిన పాత్రికేయులు తమ కుటుంబ సభ్యులతో కలిసి శిబిరంలో పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు. జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

-జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యం

టీయూడబ్ల్యూజే–ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కె. ఫైసల్ మాట్లాడుతూ రాష్ట్ర సంఘం గతంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించిందని తెలిపారు. అదే స్ఫూర్తితో సంగారెడ్డి జిల్లా జర్నలిస్టుల సంక్షేమం కోసం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమానికి సహకరించిన ఆసుపత్రి యాజమాన్యం, పత్రికా సంస్థలు, సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా అధ్యక్షుడు బండారి యాదగిరి మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం స్ఫూర్తితో జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పని ఒత్తిడి, అనిశ్చితమైన విధి వేళలను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ శిబిరం నిర్వహణలో భాగస్వాములైన స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్, సన్‌రైజ్ ఆసుపత్రి, రథసారథి తెలుగు దినపత్రిక యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు.

స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ సిద్దిఖ్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. జర్నలిస్టులతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా వైద్య పరీక్షలు చేయించుకోవడం ఆరోగ్యంపై వారిలో పెరుగుతున్న అవగాహనకు నిదర్శనమన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ చౌహాన్ మాట్లాడుతూ నిర్వాహకులు, వైద్యులు, సహకరించిన సంస్థల ప్రతినిధులు సమష్టిగా కృషి చేయడంతో శిబిరం విజయవంతమైందని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రుమాండ్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ వివిధ వైద్య విభాగాల నిపుణులు అందించిన సేవలు జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఎంతగానో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు.

-పలువురు ప్రముఖుల హాజరు

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాసంబంధాల అధికారి విజయలక్ష్మి, అదనపు జిల్లా ప్రజాసంబంధాల అధికారి ఏడుకొండలు, టీఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ, ప్రధాన కార్యదర్శి రవికుమార్, సన్‌రైజ్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ స్వామి గౌడ్, రథసారథి తెలుగు దినపత్రిక ఎండీ సంతోష్ గౌడ్, సాక్షి ప్రతినిధి బాలప్రసాద్, అక్షిత ప్రతినిధి పరంజ్యోతి, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు ప్రభాకర్, టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా ఉపాధ్యక్షుడు మతీన్, మల్లేష్, కార్యనిర్వాహక కార్యదర్శి విల్సన్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు ఆసిఫ్, కోశాధికారి సిద్ధూ జైన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు నజీర్, పాత్రికేయ సంఘాల నాయకులు హిమాయత్, రాజేశ్వర్, దినేష్ నాయక్, శ్రీకాంత్, మహేష్ గౌడ్, కొండాపూర్ రమేష్ గౌడ్, కసిని శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button