Sangareddy

సంగారెడ్డిలో ట్రాన్స్‌ఫార్మర్ల బిగింపులో భారీ గోల్‌మాల్?

ప్రజల ట్రాన్స్‌ఫార్మర్లపై కమర్షియల్ భవనాల లోడ్.. -ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేటు విద్యుత్ సదుపాయాలు.. -కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి? -నిబంధనలకు విరుద్ధంగా ఫుట్‌పాత్‌లపై ట్రాన్స్‌ఫార్మర్లు..

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 19 (రథసారథి న్యూస్):

సంగారెడ్డి పట్టణంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, కేటాయింపులో భారీ అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు రోజురోజుకూ బలపడుతున్నాయి. సంగారెడ్డి చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు ప్రధాన రహదానికి ఇరువైపులా ఉన్న వాణిజ్య సముదాయాలకు ఏర్పాటుచేసిన ట్రాన్స్ఫార్మర్లను పరిశీలిస్తే నిజా నిజాలు వెలుగులోకి వస్తాయి. విద్యుత్ శాఖ నిబంధనలను పక్కనబెట్టి కొందరు కమర్షియల్ భవనాల యజమానులకు అనుకూలంగా ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు, ఫుట్‌పాత్‌లు, రహదారుల పక్కన ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా వాణిజ్య సముదాయాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సాధారణంగా భారీ విద్యుత్ వినియోగం కలిగిన షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఫంక్షన్ హాళ్లు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్‌లు తమ అవసరాలకు అనుగుణంగా నిబంధనల ప్రకారం ప్రత్యేక విద్యుత్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రజల అవసరాల కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లపైనే అదనపు కమర్షియల్ లోడును మోపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

దీని ఫలితంగా ఒకే ట్రాన్స్‌ఫార్మర్‌పై అధిక లోడ్ పడటంతో తరచూ ఫ్యూజ్‌లు ఎగిరిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, లో-వోల్టేజ్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. గృహ వినియోగదారులే దీని వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు.  సంగారెడ్డి పట్టణంలో ఐబి పరిసర ప్రాంతాల్లో శాంతినగర్ ఏరియాలో గృహ వినియోగదారులు అధికలోడు వలన తరచూ కరెంటు పోవడం బ్రేక్ డౌన్ కావడం రాత్రి వేళలలలో పూర్తిగా కరెంటు ఆగిపోవడం లాంటి సమస్యలు ఈ ప్రణాళిక లేని ట్రాన్స్ఫార్మర్ల బిగింపు వలన పలువురు కాలనీలవాసులు వాపోతున్నారు.

పబ్లిక్ ట్రాన్స్‌ఫార్మర్లపై కమర్షియల్ భవనాల లోడ్..
మరోవైపు కమర్షియల్ వినియోగదారులు తమ స్వంత స్థలంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి కొందరు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రభుత్వ భూములను వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫుట్‌పాత్‌లపై ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడం వల్ల పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ముఖ్యంగా పాఠశాలలు, ఆసుపత్రులు, రద్దీ ప్రాంతాల వద్ద భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో లోడ్ అంచనా, సాంకేతిక ప్రమాణాలు, భద్రతా నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా ట్రాన్స్‌ఫార్మర్లను కేటాయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

కొందరు దళారుల ద్వారా పనులు జరిపిస్తూ భారీ మొత్తంలో అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి రావాల్సిన వివిధ రకాల చార్జీలు, మౌలిక వసతుల వ్యయాలు పూర్తిగా వసూలు కావడం లేదని, దాంతో ప్రభుత్వ ఖజానాకు గణనీయమైన ఆదాయ నష్టం వాటిల్లుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కాంట్రాక్టర్లు, మధ్యవర్తులు, కొందరు అధికారులు మాత్రం భారీగా లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలపై ప్రశ్నించిన ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలపై బదిలీలు, ఒత్తిళ్లు, బెదిరింపులు జరుగుతున్నాయనే ఆరోపణలు పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి. అయినప్పటికీ సంబంధిత ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించకపోవడం, వచ్చిన ఫిర్యాదులపై స్పందించకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

-విద్యుత్ అధికారులకు కాసులు కురిపిస్తున్న ట్రాన్స్ఫార్మర్ల బిగింపు ప్రక్రియ

సంగారెడ్డి జిల్లాలోని పట్టణ ప్రాంతాలతో పాటు, పలు పారిశ్రామిక, ప్రైవేటు, గృహ, గృహేతర వినియోగానికి, కమర్షియల్ విద్యుత్ వినియోగం కొరకు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటులో విద్యుత్ అధికారులకు ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది రూల్ ప్రకారం వెళ్తే విద్యుత్ సంస్థలకు పెద్ద మొత్తంలో డిపాజిట్ కట్టి ట్రాన్స్ఫార్మర్ పొందాల్సి ఉంటుంది కానీ కొందరు అక్రమార్కుల చేతివాటంతో విద్యుత్ అధికారులకు కాంట్రాక్టర్ల కుమ్మక్కుతో కోట్లలో

కుంభకోణాలు సంగారెడ్డి విద్యుత్ కార్యాలయంలోనే పలు ఆరోపణలు పత్రికల్లో వరుస కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సంగారెడ్డి విద్యుత్ కార్యాలయ ట్రాన్స్ఫార్మర్ల బిగింపు ప్రక్రియపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి అక్రమార్కులపై చర్యలు తీసుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పలువురు వినియోగదారులు కోరుతున్నారు.

-ప్రైవేట్ భవనాలకు, వెంచర్లకు ఇష్ట రాజ్యాంగ ట్రాన్స్ఫార్మర్ల కేటాయింపు దందా

సంగారెడ్డి పట్టణమే కాకుండా సంగారెడ్డి జిల్లాలోని పలు డివిజన్లో ప్రజావసరాలకు గృహావసారాలకు అనుగుణంగా వెంచర్లు ప్రైవేటు భవనాలు సంగారెడ్డి పట్టణ పరిసర ప్రాంతాలలో భారీగా ఏర్పాటు చేస్తుండడంతో ఈ ప్రత్యేక ప్రైవేటు స్థలాలకు ట్రాన్స్ఫార్మర్ల కేటాయింపు ప్రక్రియ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు వరంగా మారింది. ఈ కేటాయింపు ప్రక్రియకు అలవాటు పడిన కొందరు అక్రమార్కులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండి కొడతూ స్వలాభమే ధ్యేయంగా ఇష్టాను రాజ్యాంగ శాఖ నిబంధనలను తుంగలో తొక్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు కేటాయించి కోట్లకు పడగలెత్తిన అధికారులు కాంట్రాక్టర్లు ఉన్నారు.

ఒక్కొక్క పనికి ఒక్కొక్క రేటు ఫిక్స్ చేసి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతు రోడ్లకు పడగలెత్తి ప్రభుత్వ ఖజానాకు మొండి చేయి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురిపై పలు ఫిర్యాదులు వచ్చినప్పటికీ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ట్రాన్స్ఫార్మర్ల కేటాయింపులో గత పదివేల కాలంలో కేటాయించిన ప్రభుత్వ ప్రైవేటు ట్రాన్స్ఫార్మర్ల దందాను ఉన్నత స్థాయి అధికారులతో విచారణ చేపించి అక్రమాలకు పాల్పడిన విద్యుత్ కాంట్రాక్టర్లను సైతం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు వాపోతున్నారు.

-విద్యుత్ అధికారులు విచారణ చేపడితే నిజానిజాలు బయటపడే అవకాశం
పట్టణంలో గత కొన్నేళ్లుగా వేగంగా పెరుగుతున్న కమర్షియల్ నిర్మాణాలకు అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధి జరగకపోవడం కూడా ఈ సమస్యలకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భవిష్యత్తులో పెద్ద ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే పట్టణంలోని అన్ని ట్రాన్స్‌ఫార్మర్లపై సమగ్ర సాంకేతిక ఆడిట్ నిర్వహించి, ఏ ట్రాన్స్‌ఫార్మర్ ఏ వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేస్తోంది, నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేశారా లేదా అనే అంశాలను స్వతంత్రంగా పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర విజిలెన్స్, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు లేదా స్వతంత్ర విచారణ కమిటీతో సమగ్ర దర్యాప్తు నిర్వహించి, అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button