గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందేలా సమన్వయంతో చర్యలు
-అర్హులైన యువతను గుర్తించి శిక్షణకు ఎంపిక చేయాలి

ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలి
-కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 3 (రథసారథి న్యూస్): గ్రామీణ యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా వారి అవసరాలకు అనుగుణమైన నైపుణ్య శిక్షణలను గుర్తించి సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో ఎస్బీఐ ఆర్ఎస్ఈటీఐ, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణ అవసరమున్న యువతీ యువకులను గుర్తించి, వారికి తగిన శిక్షణ అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన నైపుణ్య కోర్సులను గుర్తించాలని కలెక్టర్ తెలిపారు.
వివిధ శాఖలు ఒకే తరహా శిక్షణలను పునరావృతం చేయకుండా ఎస్బీఐ ఆర్ఎస్ఈటీఐతో సమన్వయం చేసుకొని కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు. జిల్లాలోని నైపుణ్యాభివృద్ధి అవసరాలకు అనుగుణంగా ఆర్ఎస్ఈటీఐ వార్షిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్బీఐ ఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ.. 18 నుంచి 50 ఏళ్ల వయస్సు గల యువతీ యువకులకు సుమారు 70 రకాల కోర్సుల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పొందే అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. వివిధ శాఖలకు సంబంధించిన శిక్షణ కోర్సుల వివరాలను అధికారులకు వెల్లడించారు.
శిక్షణ అనంతరం యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు లభించేలా వివిధ శాఖలు, ఎస్బీఐ ఆర్ఎస్ఈటీఐ సమన్వయంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడంపై సమావేశంలో చర్చించారు. ఆయా శాఖల పరిధిలో శిక్షణ అవసరమున్న యువతను గుర్తించడం, వారికి అనువైన కోర్సులను ఎంపిక చేయడం, శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలతో అనుసంధానం చేయడంపై అధికారుల సూచనలు స్వీకరించారు.
సమావేశంలో డీఆర్డీఓ జ్యోతి, జెడ్పీ సీఈఓ జానకి రెడ్డి, ఎల్డీఎం సుధీర్ కుమార్, జిల్లా ఉపాధి అధికారి కిరణ్ కుమార్ రెడ్డి, ఐటీఐ ప్రిన్సిపల్ తిరుపతి రెడ్డి, ఏటీఓ కలీం బేగ్, పశుసంవర్ధక శాఖ జేడీ వసంతకుమారి, డీఐసీ జనరల్ మేనేజర్ తుల్జా నాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు పాషా, విజయలక్ష్మి, ఎస్బీఐ ఆర్ఎస్ఈటీఐ ఫ్యాకల్టీ నర్సింలుతో పాటు సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనార్టీ సంక్షేమ, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు.



