సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందాలి -సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.తాజోద్దీన్

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 15 (రథసారథి న్యూస్):
ఎందరో త్యాగధనుల పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. తాజోద్దీన్ అన్నారు. సదాశివపేటలో శనివారం సీపీఐ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాజోద్దీన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు ఎన్నో త్యాగాలు చేశారని, వారి పోరాటాల ఫలితంగానే నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నామని అన్నారు. స్వాతంత్ర్య ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా అందేలా పాలకులు కృషి చేయాలని కోరారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రతి ఒక్కరికీ అందాలని ఆకాంక్షించారు. దేశంలో అపారమైన ఖనిజ సంపద ఉందని, దానిని సక్రమంగా వినియోగించుకొని దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు.
సామాజిక, ఆర్థిక అంతరాలు లేని సమాజ నిర్మాణానికి ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. ప్రజల హక్కులకు భంగం కలిగించే విధంగా చట్టాల్లో మార్పులు చేయడం సరైన విధానం కాదని తాజోద్దీన్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ప్రతి ఒక్కరి హక్కులను గౌరవించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించి ఎనిమిది దశాబ్దాలు పూర్తవుతున్నా..
స్వేచ్ఛా ఫలాలు సమాజంలోని అట్టడుగు వర్గాల వరకు పూర్తిస్థాయిలో అందాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.డి. షఫీ, ఏఐటీయూసీ మండల కార్యదర్శి సీహెచ్. శంకరప్ప, ముంగి రమేష్, ముస్తఫా, సాదిక్ అలీ, వెంకట్, యూసుఫ్, యాకూబ్ అలీ, టి. బుజ్జమ్మ, గంగమ్మ, పూలమ్మ, సత్యమ్మ, బిపాషాబీ, యాదమ్మ, మంజుల, తస్లిమ్, దేవి తదితరులు పాల్గొన్నారు.



