Sangareddy

జగ్గారెడ్డి లాంటి ప్రజా నాయకుడు దొరకడం అరుదు

వెయ్యి కోట్లు ఇచ్చినా అలాంటి నాయకుడిని తీసుకురాలేం: సీఎం రేవంత్‌రెడ్డి

సంగారెడ్డి సభలో జగ్గారెడ్డిపై ముఖ్యమంత్రి ప్రశంసల జల్లు

సంగారెడ్డి ప్రతినిధి,, ఆగస్టు 15: (రథసారథి న్యూస్): సంగారెడ్డి ప్రజలకు జగ్గారెడ్డి వంటి ప్రజా నాయకుడు ఉండటం అదృష్టమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డిలో శనివారం నిర్వహించిన సభలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డిపై ముఖ్యమంత్రి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా జగ్గారెడ్డిని అభివర్ణించారు.

జగ్గారెడ్డి తనకంటే ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉంటారని సీఎం అన్నారు. ప్రజా సేవలో ఆయనకే మొదటి మార్కులు వేస్తానని పేర్కొన్నారు. జగ్గారెడ్డిని కోల్పోయిన వారు దురదృష్టవంతులని, అలాంటి నాయకుడు తమకు ఉండటం సంగారెడ్డి ప్రజల అదృష్టమని అన్నారు. వెయ్యి కోట్లు ఇచ్చినా జగ్గారెడ్డి లాంటి నాయకుడిని తీసుకురాలేం’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జగ్గారెడ్డికి తగిన గుర్తింపు, బాధ్యతలు దక్కేలా చూస్తానని అన్నారు. ‘‘అక్కకు ఇచ్చేది అక్కకు ఇస్తా.. జగ్గన్నకు ఇచ్చేది జగ్గన్నకే ఇస్తా’’ అని సీఎం పేర్కొన్నారు.

-రాహుల్‌ గాంధీ నిర్ణయమే తుది

జగ్గారెడ్డి రాజకీయ భవిష్యత్తుపై కూడా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీ మాటను తూచా తప్పకుండా పాటించే నాయకుడు జగ్గారెడ్డి అని అన్నారు. ‘‘రాహుల్‌ గాంధీ రాముడు అయితే.. ఆయన భక్తుడు హనుమంతుడు జగ్గారెడ్డి’’ అని అభివర్ణించారు. రాముడు ఏం ఆదేశిస్తే హనుమంతుడు దాన్ని పాటించినట్లే, రాహుల్‌ గాంధీ సూచనలను జగ్గారెడ్డి పాటిస్తారని అన్నారు.

జగ్గారెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది రాహుల్‌ గాంధీ నిర్ణయిస్తారని సీఎం స్పష్టం చేశారు. ‘‘జగ్గన్నా.. నేను పోటీ చేయను అని మరోసారి అనొద్దు. ఎక్కడి నుంచి పోటీ చేయాలో రాహుల్‌ గాంధీ చూసుకుంటారు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. కర్ణాటకలో బోసు రాజును మంత్రిగా చేసి, అనంతరం ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించిన సీఎం.. జగ్గారెడ్డి విషయంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో తనకు కూడా తెలియదని, ఆ నిర్ణయం రాహుల్‌ గాంధీదేనని పేర్కొన్నారు. సంగారెడ్డి అభివృద్ధితో పాటు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే జగ్గారెడ్డి వంటి నాయకులు అవసరమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button