Sangareddy

సన్‌రైజ్‌ ఆసుపత్రిలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 15 (రథసారథి న్యూస్):
సంగారెడ్డి పట్టణంలోని సన్‌రైజ్‌ ఆసుపత్రిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తి చాటుకున్నారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, కాలనీ ప్రతినిధులు, సభ్యులు తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ స్వామిగౌడ్‌ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమని అన్నారు.

దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల సేవలను ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం అంటే కేవలం బ్రిటిష్‌ పాలన నుంచి విముక్తి పొందడం మాత్రమే కాదని, అవినీతి, అన్యాయం, అసమానతలు, నిరక్షరాస్యత వంటి సామాజిక రుగ్మతల నుంచి విముక్తి పొందినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం సాధించినట్లవుతుందని పేర్కొన్నారు. దేశాభివృద్ధి బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదని, ప్రతి పౌరుడిపైనా ఉందని డాక్టర్‌ స్వామిగౌడ్‌ అన్నారు. హక్కుల కోసం ప్రశ్నించే ముందు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.

వ్యక్తిగత ప్రయోజనాలతో పాటు దేశం, సమాజం, భవిష్యత్‌ తరాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా దేశభక్తి, పౌర బాధ్యత, సామాజిక సేవ తదితర అంశాలపై పలువురు తమ సందేశాలను పంచుకున్నారు. దేశం కోసం ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్‌ పాలా సంతోష్‌గౌడ్‌, డాక్టర్‌ మల్లిక, రథసారథి సంపాదకురాలు పాలా స్వాతి, కాలనీ గౌరవ అధ్యక్షుడు రాములుగౌడ్‌, బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శి విజయ్‌భాస్కర్‌, మాజీ కౌన్సిలర్‌ రాజు, కాలనీ సభ్యులు, సన్‌రైజ్‌ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దేశం మనకు ఏమిచ్చిందని కాదు.. దేశానికి మనం ఏమిచ్చామో ఆలోచిద్దాం అనే సందేశంతో వేడుకలు దేశభక్తి స్ఫూర్తితో ముగిశాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button