ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
-సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయమే ప్రభుత్వ లక్ష్యం -స్వయం సహాయక సంఘాలకు రూ.225 కోట్ల రుణాల పంపిణీ

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 15 (రథసారథి న్యూస్):
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ పాలన సాగిస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. నెహ్రూ, ఇందిరమ్మ అందించిన సంక్షేమ స్ఫూర్తితో పేదలు, మహిళలు, రైతులు, యువత, విద్యార్థుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర రాజనర్సింహ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు.
వారి త్యాగాలను స్మరించుకుంటూ దేశ, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, అన్ని వర్గాల అభ్యున్నతికి సమగ్రంగా కృషి చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం సాధించిన ప్రగతిని మంత్రి వివరించారు. మహిళా సాధికారతలో భాగంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.225 కోట్ల విలువైన రుణాల చెక్కులను పంపిణీ చేశారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడంతో పాటు చిన్నతరహా వ్యాపారాలు, ఉపాధి కార్యక్రమాలను చేపట్టి మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
-ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంత్రి దామోదర రాజనర్సింహ ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



