Hyderabad

పేదల ఆకలి తీర్చే ఆత్మగౌరవ ప్రతీక రేషన్‌ కార్డు

-అర్హులైన ప్రతి కుటుంబానికీ స్మార్ట్‌ రేషన్‌ కార్డు: సీఎం రేవంత్‌రెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 15 (రథసారథి న్యూస్):
స్మార్ట్‌ రేషన్‌ కార్డు పేదలకు కేవలం గుర్తింపు పత్రం మాత్రమే కాదని, వారి ఆకలి తీర్చే ఆత్మగౌరవానికి ప్రతీక అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సంగారెడ్డిలోని అంబేద్కర్‌ స్టేడియం మైదానంలో శనివారం నిర్వహించిన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదలకు నిత్యావసర సరుకులు అందించేందుకు రేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్రంలో ఏ ఒక్క పేద కుటుంబం ఆకలితో బాధపడకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ప్రతి పేద కుటుంబానికీ నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ కార్యక్రమాలపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, అయితే పేదల కోసం గతంలో వారు చేసిన కార్యక్రమాలను ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే విద్యుత్‌ సమస్యలు తలెత్తుతాయని గతంలో చేసిన విమర్శలు ఇప్పుడు తప్పని నిరూపితమయ్యాయని అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని చెప్పారు.

-రైతులకు అండగా ప్రభుత్వం

సన్నధాన్యం సాగును ప్రోత్సహించేందుకు రైతులకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రైతు భరోసా కింద ఏడాదికి రూ.12 వేల చొప్పున అందిస్తున్నామని, ఇప్పటివరకు రూ.36 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి రూ.21 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. గత 32 నెలల్లో రైతులు పండించిన ధాన్యానికి సంబంధించి రూ.90 వేల కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామని, రెండున్నరేళ్ల కాలంలో రైతుల కోసం మొత్తం రూ.1.70 లక్షల కోట్లు వెచ్చించామని రేవంత్‌రెడ్డి తెలిపారు.

-ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు

గత ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో ఇచ్చిన హామీలకు భిన్నంగా తమ ప్రభుత్వం రెండేళ్లలో సుమారు ఏడు లక్షల ఇళ్లను మంజూరు చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం ఉండకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులకు పింఛన్లు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని, అర్హతలను పరిశీలించి పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు.

-యువతకు ఉద్యోగాల కల్పన

రాష్ట్రంలో ఇప్పటివరకు 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేశామని సీఎం వెల్లడించారు. ఇకపై ప్రతి ఆరు నెలలకు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి ఉద్యోగాల భర్తీ చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిరుద్యోగ యువత రాజకీయ నాయకుల మాయమాటలకు లోనుకాకుండా పోటీ పరీక్షలకు కష్టపడి సిద్ధం కావాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ మార్గంలో ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు.

-జగ్గారెడ్డికి ప్రజలు అండగా ఉండాలి

సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి పోటీ చేయాలా వద్దా అన్నది ఆయన వ్యక్తిగత నిర్ణయం కాదని, కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకత్వం నిర్ణయిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాహుల్‌గాంధీతో జగ్గారెడ్డికి ఉన్న అనుబంధాన్ని రాముడు–హనుమంతుడి బంధంతో పోల్చారు. ఎన్నికల్లో ఓటమి ఎదురైనా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న జగ్గారెడ్డి వంటి నాయకులు ప్రజా జీవితంలో కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. ఆయనకు ప్రజలు అండగా నిలవాలని కోరారు.

-మహిళా సాధికారతకు ప్రాధాన్యం

మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ మెదక్‌ జిల్లా ప్రజలకు ఇందిరాగాంధీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ హయాంలోనే ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి పునాది పడిందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు కల్పించడంలో ఆమె కీలక పాత్ర పోషించారని తెలిపారు. మహిళా సాధికారతలో భాగంగా కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో పలు సంస్కరణలు చేపట్టామని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనన్నారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు.

-అర్హులందరికీ రేషన్‌ కార్డులు

పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు రేషన్‌ కార్డులు అందించడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయలేదని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 3.42 కోట్ల మంది లబ్ధిదారులకు 1.06 కోట్ల రేషన్‌ కార్డుల ద్వారా ప్రయోజనం అందుతోందని తెలిపారు. కార్డులోని ప్రతి కుటుంబ సభ్యునికి నెలకు ఆరు కిలోల చొప్పున ఉచితంగా నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. రేషన్‌ కార్డు మంజూరు నిరంతర ప్రక్రియ అని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ కార్డు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

-రైతులు, యువతకు భరోసా

జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్‌ వెంకటస్వామి మాట్లాడుతూ సన్నధాన్యం సాగు చేసే రైతులకు బోనస్‌ అందిస్తూ దేశంలోనే తెలంగాణ ప్రత్యేకత చాటుకుంటోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు బోనస్‌ చెల్లిస్తున్న ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు అధునాతన సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. టామ్‌టామ్‌ వంటి సంస్థల సహకారంతో నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్‌ షెట్కార్‌, ఎమ్మెల్యేలు సంజీవరెడ్డి, నవీన్‌ యాదవ్‌, సెట్విన్‌ చైర్మన్‌ గిరిధర్‌రెడ్డి, ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్యేలు జయప్రకాశ్‌రెడ్డి, నిర్మల జగ్గారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, ఎస్పీ పరితోష్‌ పంకజ్‌, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button