కార్మిక హక్కుల సాధనకు పోరుబాట
ఈ నెల 17న బీఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా – బీఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్మరి నర్సింహులు

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 12 (రథసారథి న్యూస్):
కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమమే లక్ష్యంగా భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) నిరంతరం పోరాడుతోందని సంఘం సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్మరి నర్సింహులు తెలిపారు. శ్రమజీవుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీఎంఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న జీవన వ్యయం, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కార్మికుల వేతనాలు, పింఛన్లు, ఇతర సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం బీఎంఎస్ రూపొందించిన 2026 సంవత్సరానికి సంబంధించిన 18 ప్రధాన డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బుధవారం నంది కంది పరిధిలోని బ్లూక్రాఫ్ట్ ఆగ్రో లిమిటెడ్‌లో బీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నర్సింహులు మాట్లాడుతూ కార్మిక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వాలు కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించాలని కోరారు. కార్మికులకు న్యాయమైన వేతనాలు, మెరుగైన సామాజిక భద్రత, పింఛన్ సౌకర్యాలు, ఉద్యోగ భద్రత తదితర హక్కులను కల్పించేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీఎంఎస్ ఆధ్వర్యంలో పోరాటాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.



