సింగూర్ కాలువ, పెద్దరెడ్డిపేట ఎత్తిపోతల పథకం పనులు వేగవంతం చేయాలి
-రైతులకు సాగునీరు.. ప్రజలకు తాగునీటిపై ముందస్తు ప్రణాళిక అవసరం: మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 17(రథసారథి న్యూస్): జిల్లాలో సాగునీటి లభ్యత, తాగునీటి అవసరాలు, నీటిపారుదల పనులు, సంక్షేమ వసతిగృహాల్లో మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గురువారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులు, ఆనకట్టల భద్రత, తనిఖీ నివేదికలు, జాతీయ ఆనకట్టల భద్రతా నివేదికలను పరిశీలించారు. సింగూర్ కాలువ, పెద్దరెడ్డిపేట ఎత్తిపోతల పథకం పనులను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
సాగు చేసిన పంటలకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా, అదే సమయంలో ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా తాగునీటి అవసరాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వల వివరాలను ప్రతి వారం నివేదిక రూపంలో సమర్పించాలని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నీటి లభ్యతను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఆనకట్టలను క్రమం తప్పకుండా తనిఖీ చేసి, వాటి భద్రతకు సంబంధించిన అంశాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని నీటిపారుదల అధికారులను ఆదేశించారు.
నీటిపారుదల పనులకు ఇసుక కొరత ఏర్పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వాతావరణ పరిస్థితుల వల్ల ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేసి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ కొరత తలెత్తకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సాగునీరు, తాగునీరు, నీటి నిల్వలు, చేపట్టిన పనుల పురోగతిపై శాఖల వారీగా సమగ్ర నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు.
-బాలికల వసతిగృహ ఏర్పాటుకు ప్రతిపాదనలు
అందోల్ నియోజకవర్గంలో కళాశాల బాలికల కోసం పాఠశాలానంతర వసతిగృహం ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని మంత్రి సూచించారు. జిల్లాలోని వసతిగృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన అదనపు సౌకర్యాలు, వసతిగృహాల పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పాండు, నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు విద్యావతి, జైభీమ్, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు అఖిలేష్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



