
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 17 (రథసారథి న్యూస్): దళిత జర్నలిస్టుల ఫోరం (డిజెఎఫ్) ఆధ్వర్యంలో అక్టోబర్ 7న సంగారెడ్డిలో నిర్వహించనున్న 11వ రాష్ట్ర మహాసభల గోడపత్రికను రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ ఆవిష్కరించారు. గురువారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో డిజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తలారి యాదగిరి, జిల్లా అధ్యక్షుడు రామని అశోక్ ఆధ్వర్యంలో ఫోరం ప్రతినిధులు మంత్రిని కలిసి మహాసభలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహాసభల నిర్వహణ, లక్ష్యాలు, దళిత జర్నలిస్టుల సమస్యలు, ప్రతిపాదిత డిమాండ్లను మంత్రికి వివరించారు.
సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్డు వద్ద గల పీఎస్‌ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దళిత జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం కోసం మహాసభల్లో పలు తీర్మానాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. దళిత జర్నలిస్టుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, అర్హులైన జర్నలిస్టులందరికీ గుర్తింపు కార్డులు, ఇళ్ల స్థలాలు, పిల్లలకు ఉచిత విద్య, కుటుంబ సభ్యులకు పరిమితిలేని వైద్య సదుపాయం, ఉచిత బస్సు, రైలు ప్రయాణ పాసులు కల్పించాలని కోరారు. అలాగే అభయహస్తం కింద రూ.12 లక్షలు, అకాల మరణం చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం, నిరుద్యోగ భృతిగా నెలకు రూ.15 వేల చొప్పున అందించాలని విజ్ఞప్తి చేశారు.
సీనియర్ దళిత జర్నలిస్టులకు నామినేటెడ్ పదవులతో పాటు ప్రెస్ అకాడమీ చైర్మన్, సభ్యులుగా అవకాశం కల్పించాలని కోరారు. మహాసభలను విజయవంతం చేసేందుకు జర్నలిస్టులు, మేధావులు, ప్రజా సంఘాలు సహకరించాలని డిజెఎఫ్ నాయకులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డిజెఎఫ్ సలహాదారు మీనంపల్లి కిషన్‌రావు, జిల్లా కార్యదర్శి ముక్కగల్ల యాదన్న, జిల్లా ఉపాధ్యక్షుడు దానం మోహన్, కోశాధికారి ఎర్రోళ్ల సంపత్‌కుమార్, హెచ్.దాసు తదితరులు పాల్గొన్నారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా అధికారులు ఉన్నారు.



