Sangareddy

రెండేళ్లలో సంగారెడ్డి వైద్య కళాశాలను దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతాం

-వైద్య విద్య, సేవలు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం -మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్‌ 17 (రథసారథి న్యూస్): రాబోయే రెండేళ్లలో సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలను వైద్య విద్య, వైద్య సేవలు, మౌలిక వసతుల పరంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేలా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. గురువారం సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణంలో హెటిరో ఫౌండేషన్‌ సహకారంతో రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన బాస్కెట్‌బాల్‌, క్రికెట్‌, కబడ్డీ క్రీడా ప్రాంగణాలతో పాటు బహిరంగ క్రికెట్‌ మైదానాన్ని మంత్రి ప్రారంభించారు.

అనంతరం విద్యార్థులతో కలిసి క్రికెట్‌ ఆడి వారిలో ఉత్సాహం నింపారు. కళాశాల ప్రాంగణంలోని సభా మందిరంలో నిర్వహించిన విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ వైద్య విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమన్నారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, ఏకాగ్రత పెరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు చదువులో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి వైద్యం, విద్య, సాధికారత, సామాజిక భద్రత వంటి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన సౌకర్యాలతో సుమారు రూ.500 కోట్ల వ్యయంతో ఆసుపత్రుల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణను వైద్య రంగంలో దేశంలోనే ముందంజలో నిలపడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ సమాజం పట్ల తమ బాధ్యతను విస్మరించరాదని మంత్రి సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తూ ప్రజలకు చేరువ కావాలని కోరారు. ప్రభుత్వాలు, నాయకత్వాలు శాశ్వతం కాదని, ప్రజలకు నిరంతరం సేవలు అందేలా వ్యవస్థలను బలోపేతం చేయడం ముఖ్యమని పేర్కొన్నారు.

అనంతరం యూనియన్‌ బ్యాంక్‌ సామాజిక సేవా సంస్థ సహకారంతో సామాజిక బాధ్యత నిధుల ద్వారా క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను మంత్రి పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 700 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు నెలకు ఒక కిట్‌ చొప్పున ఆరు నెలల పాటు ఉచితంగా పోషకాహార కిట్లు అందిస్తున్నట్లు తెలిపారు. క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్‌ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, జిల్లా ఎస్పీ పరితోష్‌ పంకజ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జి.అంజయ్య, అదనపు కలెక్టర్‌ పాండు, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ మురళీకృష్ణ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ప్రకాశరావు, ఆర్డీఓ రాజేందర్‌, హెటిరో ఫౌండేషన్‌ ప్రతినిధి సుధాకర్‌, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button