Sangareddy

ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

-ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 17 (రథసారథి న్యూస్): ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి కలెక్టరేట్‌ ప్రాంగణంలో గురువారం ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, జిల్లా పోలీసు అధికారి పరితోష్‌ పంకజ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రభుత్వ సేవలు అందించేందుకు ప్రజాపాలనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. పాలనను ప్రజల వద్దకే తీసుకెళ్లి వారి సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారం చూపేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.

ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించి సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ వాటి ప్రయోజనాలను పొందేలా చూడాలని సూచించారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

-అమరవీరులకు ఘన నివాళి

కార్యక్రమానికి ముందు మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

-దివ్యాంగులకు రూ.13.10 లక్షల విలువైన సహాయ పరికరాలు

ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత సహాయ పరికరాలను పంపిణీ చేశారు. తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ, హైదరాబాద్‌ ఆధ్వర్యంలో, సంగారెడ్డికి చెందిన గ్లోబల్‌ గ్రీన్‌ కంపెనీ సహకారంతో సుమారు రూ.13.10 లక్షల విలువైన 21 బ్యాటరీ ఆధారిత త్రిచక్ర వాహనాలు, ఒక బ్యాటరీ ఆటోను లబ్ధిదారులకు అందజేశారు. ఈ పరికరాలు దివ్యాంగులు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు దోహదపడతాయని అధికారులు తెలిపారు.

ప్రభుత్వం, వివిధ సంస్థల సహకారంతో అర్హులైన దివ్యాంగులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) పాండు, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) సంగీత, జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button