కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసే కుట్రలను అడ్డుకుంటాం-ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 17 (రథసారథి న్యూస్):
తెలంగాణలో పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేసి రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్తో పాటు బీఆర్ఎస్ నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ పాండుకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ హైకోర్టు తీర్పును సాకుగా చూపిస్తూ లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేసీఆర్ ఒక మేనమామలా పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచారు.
దాదాపు 3 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు సుమారు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం అందించారు. కోవిడ్ వంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభ సమయంలో కూడా పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం అండగా నిలిచింది అని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వల్ల పేద కుటుంబాల్లో పెళ్లి భారం తగ్గిందని, అనేకమంది ఆడబిడ్డలు తమ విద్యను కొనసాగించేందుకు కూడా అవకాశం ఏర్పడిందని తెలిపారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఈ పథకం గొప్ప భరోసాగా నిలిచిందన్నారు. ఈ పథకానికి జాతీయస్థాయిలో కూడా ప్రశంసలు లభించాయని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో కళ్యాణ లక్ష్మితో పాటు ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకపోగా, ఇప్పటికే అమల్లో ఉన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసింది” అని చింత ప్రభాకర్ మండిపడ్డారు. కళ్యాణ లక్ష్మి ఏమైంది? షాదీ ముబారక్ ఏమైంది? పెండింగ్లో ఉన్న ఆన్లైన్ దరఖాస్తుదారులకు ఆర్థిక సహాయం ఎప్పుడు అందిస్తారు? ఎన్నికల్లో హామీ ఇచ్చిన తులం బంగారం ఎప్పుడు ఇస్తారు?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన అనేకమంది లబ్ధిదారులు తమకు రావాల్సిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సాయం కోసం ఇప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేస్తుందని చింత ప్రభాకర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఉండకూడదు, ప్రజలకు మేలు జరగకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేసేందుకు కుట్ర చేస్తోంది అని ఆరోపించారు.
ప్రభుత్వం కావాలనే కేసు విషయంలో సరైన విధంగా స్పందించకుండా ఇప్పుడు హైకోర్టు తీర్పును సాకుగా చూపిస్తోందని విమర్శించారు. కళ్యాణ లక్ష్మి అంశం హైకోర్టు పరిధిలో ఉన్న సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణం. పలుమార్లు గడువు లభించినప్పటికీ ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదు? పేదింటి ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన ఇంత కీలకమైన పథకం విషయంలో ప్రభుత్వం సరైన వాదనలు ఎందుకు వినిపించలేదు? అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ…
ముఖ్యమంత్రి, మంత్రులు లేదా ప్రభుత్వానికి సంబంధించిన కీలక కేసుల్లో ప్రైవేట్ న్యాయవాదుల సేవలు తీసుకునే ప్రభుత్వం, పేద ఆడబిడ్డల హక్కులకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి విషయంలో మాత్రం ఎందుకు సరిగ్గా స్పందించలేదు?” అని ప్రశ్నించారు. ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేసి, ఇప్పుడు హైకోర్టు తీర్పును సాకుగా చూపిస్తూ పథకాన్ని నిలిపివేసిందని ఆరోపించారు.
లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఇలాంటి పథకాలను రద్దు చేసే ప్రయత్నాలను అడ్డుకోవడం ప్రతిపక్షంగా మా బాధ్యత. ఎన్నికల ముందు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఆ హామీని అమలు చేయకుండా ఇప్పుడు పేద ఆడబిడ్డలను మోసం చేస్తోంది అని అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసే ప్రయత్నం చేస్తే పేద ఆడబిడ్డలు, వారి కుటుంబాలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుతారు. అని చంటి క్రాంతి కిరణ్ హెచ్చరించారు. కళ్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి.. పేదింటి ఆడబిడ్డల హక్కులను కాపాడాలి.. పెండింగ్లో ఉన్న లబ్ధిదారులకు వెంటనే ఆర్థిక సాయం అందించాలి అని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.



