Hyderabad

జిల్లాస్థాయిలో ముసాయిదా ఓటరు జాబితా విడుదల

సెప్టెంబర్ 16లోగా క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 17 (రథసారథి న్యూస్):

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ముసాయిదా ఓటరు జాబితాను సోమవారం విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా విడుదల సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనలు, నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు.

ముసాయిదా ఓటరు జాబితాలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ పేరు, చిరునామా, ఇతర వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. జాబితాలో పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులు ఉన్నా, మార్పులు లేదా సవరణలు అవసరమైనా 2026 సెప్టెంబర్ 16లోగా సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి నిర్ణీత విధానంలో క్లెయిమ్‌లు, అభ్యంతరాలు లేదా సవరణలకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ విషయంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు.

-జిల్లాలో 11,59,158 మంది ఓటర్లు

జిల్లాలోని సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాల ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం మొత్తం 11,59,158 మంది ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. వీరిలో 5,75,067 మంది పురుషులు, 5,84,027 మంది మహిళలు, 64 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని వివరించారు.

-నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు

35–నారాయణఖేడ్: 2,08,225 మంది

36–ఆందోల్: 2,22,581 మంది

38–జహీరాబాద్: 2,31,891 మంది

39–సంగారెడ్డి: 2,04,681 మంది

40–పటాన్‌చెరు: 2,91,780 మంది

అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడడంతో పాటు, అనర్హుల పేర్లు తొలగించి పారదర్శకమైన, తప్పులులేని ఓటరు జాబితా రూపొందించడమే సర్ ప్రక్రియ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. ముసాయిదా జాబితాలో పేరు లేని అర్హత కలిగిన వ్యక్తులు, అలాగే ఓటరు వివరాల్లో మార్పులు లేదా సవరణలు కోరుకునే వారు నిర్దేశిత గడువులోగా క్లెయిమ్‌లు, అభ్యంతరాలు లేదా సవరణలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ముసాయిదా ఓటరు జాబితాపై అందిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పరిశీలించి అక్టోబర్ 15, 2026లోగా పరిష్కరించి, అనంతరం తుది ఓటరు జాబితాను రూపొందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాలు సంబంధిత ఈఆర్వోలు, ఏ ఈ ఆర్ వో లు/తహసీల్దార్ కార్యాలయాలతో పాటు అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు, ఇతర వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button