రైతుల సంక్షేమాన్ని గాలికొదిలిన కాంగ్రెస్ ప్రభుత్వం
ఆరు గ్యారెంటీలు.. 420 హామీల అమలులో ఘోర వైఫల్యం

సంగారెడ్డిలో రైతు అవగాహన సదస్సు, వంటావార్పు
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజం
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 3 (రథసారథి న్యూస్):
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు, వంటావార్పు కార్యక్రమాలను నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
-రైతు సంక్షేమానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రాధాన్యత
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ ఫ్లెక్సీ ప్రదర్శన చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు, రైతు కుటుంబాలకు ఆపద సమయంలో అండగా నిలిచేందుకు రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేశామని గుర్తు చేశారు. రైతు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందేలా రైతుబీమా పథకాన్ని అమలు చేశామని తెలిపారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్, ఎరువులు, విత్తనాలను సకాలంలో అందించేందుకు గత ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. రైతును కేంద్రంగా చేసుకుని బీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసిందని అన్నారు.
-వెయ్యి రోజుల పాలనపై సంబరాలా?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను సంబరంగా జరుపుకోవాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చింత ప్రభాకర్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా సంబరాలు ఎలా జరుపుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో అనేకం ఇంకా అమలుకు నోచుకోలేదన్నారు. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీల పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆరోపించారు. రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.
-రైతన్నలను ఆగం చేసిన కాంగ్రెస్
కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు కల్పించిన భరోసా, ప్రస్తుత పాలనలో కనిపించడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతును కేంద్రంగా చేసుకుని పాలన సాగించింది. రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం, రైతుబీమా ద్వారా ఆపదలో ఉన్న కుటుంబాలకు భరోసా, 24 గంటల ఉచిత విద్యుత్ ద్వారా వ్యవసాయానికి అండగా నిలిచాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది” అని అన్నారు. ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. వ్యవసాయ రంగానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు తదితర వనరులను సకాలంలో అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
-హామీలు అమలు చేసే వరకు బీఆర్‌ఎస్ పోరాటం
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ డిమాండ్ చేశారు. రైతులు, ప్రజల సమస్యలను పరిష్కరించే వరకు బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం ఆపదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో రైతుల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతుల పక్షాన బీఆర్‌ఎస్ ఎప్పటికీ అండగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని చింత ప్రభాకర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సి డి సి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ శ్రీహరి, కొండల్ రెడ్డి, మనోహర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు విఠల్, మధుసూదన్ రెడ్డి, చక్రపాణి, ఆంజనేయులు, సదాశివపేట పట్టణ అధ్యక్షులు చీల మల్లన్న, పట్టణ కార్యదర్శి వీరేశంతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



