Hyderabad

దళిత నాయకులను గౌరవించడంలో కాంగ్రెస్‌దే ప్రత్యేక వైఖరి

ఖర్గేను రాహుల్‌, సోనియాగాంధీ ఎంతో గౌరవిస్తారు

-బంగారు లక్ష్మణ్‌ను బీజేపీ అవమానకరంగా పదవి నుంచి తొలగించింది

-గాంధీ భవన్‌లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి విమర్శలు

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్‌ 3 (రథసారథి న్యూస్): దళిత నాయకులను గౌరవించడంలో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య స్పష్టమైన తేడా ఉందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అన్నారు. రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ ఎంతో గౌరవిస్తారని తెలిపారు. గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మల్లికార్జున ఖర్గే దళిత నాయకుడిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్‌లో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం సభా ప్రాంగణాన్ని బీజేపీ అనుబంధ నాయకులు శుభ్రం చేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా బీజేపీ, దాని అనుబంధ సంస్థలు జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ అంశంపై రాహుల్‌గాంధీ ప్రశ్నించిన వ్యాఖ్యలను బీజేపీ ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి ప్రచారం చేస్తోందని జగ్గారెడ్డి ఆరోపించారు. రాహుల్‌గాంధీ దళిత వ్యతిరేకి అనే ముద్ర వేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు.

తెలంగాణకు చెందిన దళిత నాయకుడు బంగారు లక్ష్మణ్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించినప్పటికీ, అనంతరం ఆయనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తీరును జగ్గారెడ్డి ప్రశ్నించారు. బంగారు లక్ష్మణ్‌పై అప్పట్లో జరిగిన ‘తెహల్కా’ స్టింగ్‌ ఆపరేషన్‌ను ప్రస్తావిస్తూ, పార్టీకి నిధులు స్వీకరించినట్లు ఆరోపణలు చేసి ఆయనను అవమానకర పరిస్థితుల్లో పదవి నుంచి తప్పించారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ దళిత నాయకత్వాన్ని గౌరవిస్తారని, సామాజిక వర్గాల ఆధారంగా నాయకులను చూసే ధోరణి తమ పార్టీలో లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

ఖర్గేతో కలిసి నడవాల్సిన సందర్భాల్లో రాహుల్‌గాంధీ ఆయన చేయి పట్టుకుని నడిచిన సందర్భాలను ఇందుకు ఉదాహరణగా చూపించారు. బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ.. ఆ పార్టీ అహంకార ధోరణితో వ్యవహరిస్తోందని, గాంధీ కుటుంబానికి అలాంటి అహంకార భావన లేదని జగ్గారెడ్డి అన్నారు. దళితులు, గిరిజనుల పట్ల సమానత్వ భావనతో కాంగ్రెస్‌ పనిచేస్తుందని పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button