సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణుల భారీ ద్విచక్ర వాహన ర్యాలీ
పార్టీలకతీతంగా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాల లబ్ధి

-డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 3 (రథసారథి న్యూస్):
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1,000 రోజులు పూర్తయిన సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించాయి. కంది, కొండాపూర్ మండల కేంద్రాలతో పాటు సంగారెడ్డి పట్టణంలో నిర్వహించిన ర్యాలీలను డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సంగారెడ్డి పట్టణంలో రామ్‌మందిర్ నుంచి ప్రారంభమైన ద్విచక్ర వాహన ర్యాలీ భవానీ మందిర్, నల్సాబ్‌గడ్డ, రుక్మిణి థియేటర్, శాంతినగర్, రాజంపేట, ఇందిరానగర్, తార డిగ్రీ కళాశాల, బైపాస్ రోడ్డు మీదుగా ఐబీ నెహ్రూ జంక్షన్ వరకు కొనసాగింది.
ర్యాలీ అనంతరం ఐబీ జంక్షన్‌లో మాజీ ప్రధానమంత్రులు జవహర్‌లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు నిర్మలా జగ్గారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. కోటికి పైగా రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం నామమాత్రంగా సాగిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల సాకారమవుతోందని అన్నారు. మ్యానిఫెస్టోలో పేర్కొనని పలు సంక్షేమ పథకాలను సైతం ప్రభుత్వం అమలు చేస్తోందని, పార్టీలకతీతంగా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతున్నాయని నిర్మలా జగ్గారెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ ప్రభు, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుగౌడ్, జార్జ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ షఫీ హఫీజ్, నాయకులు కూన సంతోష్, కిరణ్‌గౌడ్, శ్రీకాంత్‌గౌడ్, మహేష్, కంది సర్పంచ్ శ్రీరామ్, రమేష్, భూమేష్, ఫయాజ్, అన్వర్, సురేష్, కిరణ్, వంశీ, రవీందర్ నాయక్, శ్రీశైలం, ప్రశాంత్, రాజుగౌడ్, హరీష్, తాహెర్, జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



