Sangareddy

ఆరు గ్యారంటీలు.. 420 హామీలు ఏమయ్యాయి?

-కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ సమరశంఖం

-సంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట భారీ ధర్నా.

-కాంగ్రెస్‌ బాకీ కార్డుల’ పంపిణీ

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 2 (రథసారథి న్యూస్):

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో వైఫల్యాలను ఎండగడుతూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ ధర్నా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గారి ఆదేశాల మేరకు స్థానిక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ గారి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహ ఆవరణలో ఈ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ధర్నా కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

-ప్రజల మధ్యకు కాంగ్రెస్‌ బాకీ కార్డులు

ధర్నా అనంతరం బీఆర్‌ఎస్‌ నాయకులు వినూత్నంగా ‘కాంగ్రెస్‌ బాకీ కార్డులు’ పంపిణీ చేశారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రజలకు, ఆటోల్లో వెళ్తున్న ప్రయాణికులకు, ఇతర వాహనదారులకు, పాదచారులకు కార్డులను అందజేస్తూ కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. హామీలు ఇచ్చారు.. ఓట్లు అడిగారు.. అధికారంలోకి వచ్చారు.. కానీ హామీలు మాత్రం అమలు చేయలేదు. అంటూ ప్రజలకు వివరించారు.

-కాంగ్రెస్‌ పాలనపై చింత ప్రభాకర్‌ ఫైర్‌

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజుల పాలన పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు ఆశలు కల్పించి, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. రైతులకు రుణమాఫీ, రైతుభరోసా, మహిళలకు హామీ ఇచ్చిన పథకాలు, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగులకు భరోసా, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదలు, కార్మికులు ఇలా ఏ వర్గానికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం న్యాయం చేయలేదని అన్నారు.

ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరు

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని చింత ప్రభాకర్‌ అన్నారు. ఎన్నికల ముందు ఒక మాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట అన్నట్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వ వ్యవహారం ఉందని విమర్శించారు. రైతులు తమ సమస్యల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని, యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోందని, మహిళలు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం రాజకీయ ప్రచారానికే పరిమితమైందని ఆరోపించారు.

13 డిక్లరేషన్ల పేరుతో ప్రజలను మోసం చేశారు

రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ తెలంగాణకు వచ్చి వివిధ డిక్లరేషన్ల పేరుతో ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని చింత ప్రభాకర్‌ విమర్శించారు. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. సామాజిక న్యాయం, సంక్షేమం పేరుతో ప్రజలను ఆకర్షించి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటను మరిచారని మండిపడ్డారు.

-కేసీఆర్‌ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష

తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం, సాగునీరు, రైతుల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి విషయంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని చింత ప్రభాకర్‌ అన్నారు.
తెలంగాణకు మళ్లీ కేసీఆర్‌ నాయకత్వం అవసరం. కేసీఆర్‌ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష”* అని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ నిరంతరం పోరాడుతుందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

-హామీలు అమలు చేయకపోతే ఉద్యమం ఉధృతం

ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్‌ ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ రాజీ పడబోదని, ప్రభుత్వం తన వైఫల్యాలను సరిదిద్దుకోకపోతే వారం రోజుల కార్యక్రమాలను మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో మరింత విస్తృతంగా నిరసనలు చేపడతామని తెలిపారు. ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకగా బీఆర్‌ఎస్‌ ఉంటుంది.. ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుంది.

అని చింత ప్రభాకర్‌ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం ,మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, హకీమ్, డాక్టర్ శ్రీహరి, సునీల్, మనోహర్ గౌడ్, కొండల్ రెడ్డి, చింత సాయినాథ్ , మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి,చక్రపాణి, విఠల్, ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు చీల మలన్న, చింత గోపాల్ , శ్రవణ్ రెడ్డి బీఆర్‌ఎస్‌ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button